Chiranjeevi- Allu Arjun: లోకాలు చుట్టేస్తున్న మామ- అల్లుళ్లు.. గెలిచేదెవరో

ABN , Publish Date - Nov 26 , 2025 | 10:13 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా అట్లీ కుమార్ (Atlee) తెరకెక్కిస్తోన్న సినిమా కథ ఏంటి అన్న దానిపై భలే చర్చ సాగుతోంది.

Chiranjeevi- Allu Arjun

Chiranjeevi- Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా అట్లీ కుమార్ (Atlee) తెరకెక్కిస్తోన్న సినిమా కథ ఏంటి అన్న దానిపై భలే చర్చ సాగుతోంది. ఇదో సైంటిఫిక్ ఫిక్షన్ అని కొందరు - మైథలాజికల్ టచ్ ఉన్న మూవీ అని మరికొందరు అంటున్నారు... ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు గెటప్స్ లో కనిపిస్తారని విశేషంగా వినిపిస్తోంది. ఈ మూడు పాత్రలు మూడు లోకాలకు చెందినవనీ కొందరంటున్నారు. దాంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ తరహా కథలు హాలీవుడ్ లోనూ వెలుగు చూస్తున్నాయి. అచ్చు ఒకేలా ఉన్న వ్యక్తులు మరో డైమెన్షన్ నుండి భూలోకానికి రావడం అన్న కాన్సెప్ట్ తో ఇప్పటికే కొన్ని హాలీవుడ్ మూవీస్ సందడి చేశాయి. అందువల్ల బన్నీ సినిమా కూడా అదే తీరున సాగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.


బన్నీ- అట్లీ మూవీ కంటే ముందుగానే ప్రారంభమైన మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'లో ఏకంగా ఏడు లోకాల చుట్టూ సాగే కథ ఉందట!. సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఆ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ యేడాది సంక్రాంతి బరిలోనే దూకుతుందని వినిపించింది. అయితే వీఎఫ్ఎక్స్ కారణంగా ఆలస్యమైందని అన్నారు. అందువల్ల ముందుగా చిరంజీవి నటిస్తోన్న మరో సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు' విడుదలవుతుందని, తరువాతే 'విశ్వంభర' వస్తుందని తెలుస్తోంది. 2026 వేసవిలో 'విశ్వంభర' రానుందని సమాచారం.


'విశ్వంభర' సినిమా షూటింగ్ కు దాదాపు రెండేళ్ళ సమయం పట్టింది.అలాగే బన్నీ- అట్లీ మూవీ కూడా రెండేళ్ళ తరువాత పలకరిస్తుందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ మే-జూన్ లోపు పూర్తవుతుందట. ఆ తరువాత బన్నీ ఫ్రీ అయిపోతారని తెలుస్తోంది. 2026 జూన్ లోపే బన్నీ- అట్లీ షూటింగ్ పూర్తయినా, ఆ మూవీ గ్రాఫిక్ వర్క్ కోసం దాదాపు ఎనిమిది నెలలు పడుతుందని అంటున్నారు. జనం మెచ్చేలా ఔట్ పుట్ రావడానికి యూనిట్ కృషి చేస్తోందని, 2027 మార్చిలో బన్నీ మూవీ ప్రేక్షకులను పలకరిస్తుందని వినికిడి. ఏది ఏమైనా ప్రస్తుతం సినీఫ్యాన్స్ లో మాత్రం అల్లుడు మూడు అంటే మామ ఏడు అంటున్నాడని టాక్ నడుస్తోంది. మరి 2026లో వచ్చే 'విశ్వంభర', 2027లో వెలుగు చూసే బన్నీ-అట్లీ మూవీ ఏ తీరున మురిపిస్తాయో చూడాలి.

Updated Date - Nov 27 , 2025 | 03:14 PM