Pushpa-2: పుష్ప-2 ఘటన.. ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు
ABN , Publish Date - Dec 27 , 2025 | 05:42 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) నటించిన ‘పుష్ప2: ది రూల్‘(Pushap2) ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన విషాదకర ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Pushpa-2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) నటించిన ‘పుష్ప2: ది రూల్‘(Pushap2) ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన విషాదకర ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు తాజాగా కోర్టులో 100 పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్‌మెంట్‌ను, ఏ-11గా అల్లు అర్జున్‌ని చేర్చుతూ, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది సహా 23 మందిపై ఛార్జిషీట్ దాఖలయ్యింది. ఈ తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ మరణించగా, ఆమె చిన్న కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
దర్యాప్తులో భాగంగా పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని తమ ఛార్జిషీట్‌లో స్పష్టం చేశారు. ఇంత పెద్ద ఎత్తున జనం వస్తారని తెలిసి కూడా కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. అలానే అల్లు అర్జున్ రాకను ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, ఆయన బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టడం వంటి కారణాలతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ ను అరెస్టు చేయగా, బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిశీలిస్తోంది. త్వరలోనే ఈ కేసులో ఉన్న నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. టాలీవుడ్ అగ్ర హీరో పేరు నిందితుల జాబితాలో ఉండటంతో ఈ అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ఆరోజు అసలు ఏం జరిగిందంటే.. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్(RTC Cross Roads)లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చాడు. బన్నీని చూడటానికి అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఊపిరాడక రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె చిన్న కుమారుడు శ్రీతేజ్(Sreetej) తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు.
ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప-2: ది రూల్' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1800 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు.