Bellamkonda Srinu: హీరోలు అయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించరా..
ABN, Publish Date - May 15 , 2025 | 03:37 PM
హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసుపై శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారు.
హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసుపై శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో బెల్లంకొండ శ్రీనివాస్ నివాసం ఉంటున్నారు. తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో వచ్చారు. అయితే రాంగ్ రూట్లో వస్తున్న బెల్లంకొండను గమనించారు అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. వెంటనే హీరోను అడ్డుకున్నారు. దీంతో సదరు కానిస్టేబుల్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారు. కానిస్టేబుల్‌పైకి కారుతో దూసుకెళ్లినందుకు ప్రయత్నించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈనెల 13న రోడ్ నెంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని నివాసానికి వెళ్తున్నారు హీరో. జర్నలిస్ట్ కాలనీలోని చౌరస్తా వద్ద రాంగ్‌రూట్‌లో తన నివాసానికి వెళ్లేందుకు హీరో ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న నరేష్ అనే కానిస్టేబుల్ బెల్లంకొండ శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకున్నారు. రాంగ్ రూట్‌లో వెళ్లొద్దంటూ సూచించారు. అయితే కానిస్టేబుల్ చెబుతున్నప్పటికీ కూడా ఏమాత్రం వినకుండా రాంగ్ రూట్‌లోనే ముందుకు వెళ్లేందుకు హీరో ప్రయత్నించారు. ఇదే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు బెల్లంకొండ శ్రీనివాస్‌కు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. కారును ఆపేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ చేయడంతో.. ఆయన మీదుగానే కారును పోనిచ్చేందుకు బెల్లంకొండ ప్రయత్నించారు. ఇదే సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్పుకోవడంతో కొంత ప్రమాదం తప్పింది. ఈ వ్యవహారం మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ మారింది. బెల్లంకొండపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ హీరోలు అయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించరా.. రాంగ్ రూట్‌లో ఎలా వెళ్తారంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ఈ విషయాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీసీ టీవీ ఫుటేజ్‌తో పాటు వీడియోలను కూడా పరిశీలించిన ఉన్నతాధికారులు.. బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసును నమోదు చేశారు. ప్రధానంగా రాంగ్ రూట్‌లో కారు నడపడంతో పాటు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించిన కారణంగా బెల్లంకొండపై కేసు నమోదు అయ్యింది.