Bunny Vas: ఐ బొమ్మ రవిని.. సమర్థించడం సరికాదు

ABN , Publish Date - Nov 22 , 2025 | 05:40 PM

సినిమాల పైరసీదారుడు ఐ బొమ్మ రవిని కొందరు సోషల్ మీడియాలో సమర్థించడాన్ని నిర్మాత, పంపిణీ దారుడు బన్నీ వాసు ఖండించారు.

Bunny Vasu

సినిమాలను పైరసీ తద్వారా చిత్రసీమకు కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న ఐ బొమ్మ రవి (I Bomma Ravi) ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఐ బొమ్మ రవిని సమర్థిస్తూ పోస్టులు పెట్టడాన్ని బన్నీ వాసు ఖండించారు. జిఎ-2 బ్యానర్ లోని పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి బన్నీ వాసు (Bunny Vasu) ఇప్పుడు పలు చిత్రాలను పంపిణీ చేస్తున్నారు.

తాజాగా విడుదలై విజయం సాధించిన 'రాజు వెడ్స్ రాంబాయి' (Raju Weds Rambai) మూవీని సైతం వంశీ నందిపాటి (Vamsi Nandipati) తో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఐ బొమ్మ రవి వివాదం గురించి బన్నీ వాసు మాట్లాడుతూ, 'పైరసీ చేయడం అనేది పెద్ద తప్పు. అలాంటి తప్పును తమకు లాభం కలిగిందని సమర్థించడం కరెక్ట్ కాదు. చాలామంది టిక్కెట్ రేట్లు అధికంగా ఉండటం వల్లే తాము పైరసీని ఎంకరేజ్ చేస్తున్నామని అంటున్నారు.

నిజం చెప్పాలంటే... ఏడాదిలో పదో పదిహేనో సినిమాలకే టికెట్ రేట్స్ పెంచుతున్నారు. కానీ ఆ సినిమాలకే కాకుండా మిగతా అన్ని చిత్రాలు పైరసీకి గురవుతున్నాయి. ఆస్తులు అమ్మి సినిమాలు చేస్తున్న ఎంతోమంది చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు. పైకి నిర్మాతలు బాగానే కనిపిస్తున్నా, వెనక వారికి బాధలెన్నో ఉంటాయి' అని బన్నీ వాసు అన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 06:26 PM