Rewind 2025: అక్కడ హీరోలు.. ఇక్కడ విలన్లు.. అదరగొట్టారు
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:02 PM
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ తన సత్తా చాటుతోంది. ఒకప్పుడు తెలుగులో నటించడం నామోషీ అనుకున్నవారే.
Rewind 2025: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ తన సత్తా చాటుతోంది. ఒకప్పుడు తెలుగులో నటించడం నామోషీ అనుకున్నవారే... ఇప్పుడు టాలీవుడ్ లో నటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఈ ఏడాది పరభాషల నుంచి వచ్చి టాలీవుడ్ లో తమ సత్తా చాటిన నటీనటులు ఎవరో చూద్దాం.
బాబీ డియోల్
బాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు బాబీ డియోల్. ఇక హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి నెమ్మదిగా విలన్ గా మారాడు. 2020 లో 'ఆశ్రమ్' అనే వెబ్ సిరీస్ లో విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఆ విలనిజాన్ని మెచ్చిన సందీప్ రెడ్డి వంగా.. 'యానిమల్' సినిమాలో విలన్ గా నటింప చేశాడు. ఈ సినిమా హీరో రణబీర్ కి ఎంత పేరు వచ్చిందో దానికి వందరెట్లు బాబీ డియోల్ కి వచ్చింది. ఇక ఈ ఒక్క సినిమా బాబీ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమా తరువాత బాబీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. మొదట హరిహర వీరమల్లు సినిమాలోనే నటించినా.. దానికన్నా ముందు బాలకృష్ణ 'డాకూ మహారాజ్' రిలీజ్ అవ్వడంతో అదే మొదటి సినిమాగా మారింది. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలకు విలన్ గా బాబీ ఫస్ట్ ఛాయిస్ గా మారాడు.
ఇమ్రాన్ హష్మీ
ఈ ఏడాది చాలామంది విలన్స్ టాలీవుడ్ కి పరిచయమయ్యారు. కానీ, మోస్ట్ స్టైలిష్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నది మాత్రం ఇమ్రాన్ హష్మీ అనే చెప్పాలి. బాలీవుడ్ లో సీరియల్ కిస్సర్ గా పేరు తెచ్చుకునన్ ఇమ్రాన్ హష్మీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓజీ' సినిమాలో ఒమీగా తెలుగువారి ముందు నిలిచాడు... 'ఓజీ'లో ఓమీగా ఇమ్రాన్ మంచి మార్కులే సంపాదించాడు... ప్రస్తుతం ఇమ్రాన్.. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నాడు. మరి తెలుగులో స్టార్ హీరోలకు దీటైన విలన్ కావాలి అనుకున్నప్పుడు టాలీవుడ్ డైరెక్టర్స్ ఇమ్రాన్ హష్మీని కన్సిడర్ చేస్తారేమో చూడాలి.
సోహైల్ ఖాన్
టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మరో బాలీవుడ్ నటుడు సొహైల్ ఖాన్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సొహైల్.. బాలీవుడ్ లో తన ఉనికిని కోల్పోయాడు. నటుడిగా కాకుండా నిర్మాతగా మారి అడపాదడపా కనిపించిన సొహైల్.. ఈ ఏడాది తెలుగులో వచ్చిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతీ' సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కరుడుగట్టిన తీవ్రవాదిగా కనిపించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో సొహైల్ కి మరో తెలుగు సినిమా దక్కలేదు.
జిమ్ సర్బ్
ఒక సినిమాకు హీరో ఎంత ముఖ్యమో.. ఆ హీరోను ఎలివేట్ చేసే విలన్ కూడా అంతే ముఖ్యం. 'కుబేర' సినిమా చూసినవారిలో చాలా మంది ధనుష్ అభినయానికి ఫిదా అయ్యారు. ఇంకొందరు నాగార్జున నటనను మెచ్చారు. అందరి కంటే ఎక్కువ శాతం.. విలన్ గా నటించిన జిమ్ సర్బ్ నటన చూసి వారెవ్వా అన్నారని చెప్పొచ్చు. బాలీవుడ్ లో నటుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జిమ్.. కుబేర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో నటించడం మొదటిసారి అయినా కూడా ఆయన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో జిమ్ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం జిమ్ హిందీలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు. ముందు ముందు తెలుగులో కూడా బిజీగా మారే ఛాన్స్ లు ఉన్నాయని చెప్పొచ్చు.
అక్షయ్ కుమార్
బాలీవుడ్ ఖిలాడీగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్.. ఎట్టకేలకు ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అంటే హీరోగానో.. విలన్ గానో కాకుండా ఒక చిన్న క్యామియోలో కనిపించాడు. అయితే మాత్రం అక్షయ్ కు మంచి పేరే వచ్చింది. తమిళ చిత్రం '2.0' సినిమాతో అక్షయ్.. కోలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఖిలాడీ హీరో ఏ తెలుగు సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెడతాడో అని జనం అనుకున్నారు... ఎవరు ఊహించని విధంగా మంచు విష్ణు.. అక్షయ్ ని శివుడిగా చూపించి షాక్ ఇచ్చాడు. మంచు విష్ణు హీరోగా నటించిన 'కన్నప్ప' సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు క్యామియోగా కనిపించినా.. ముందు ముందు అక్షయ్ విలన్ గా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.