Nandamuri Balakrishna: వారివల్లే ఈ విజయం సాధ్యమైంది

ABN , Publish Date - Aug 01 , 2025 | 09:22 PM

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balkrishna)కు ఈ ఏడాది పట్టిందల్లా బంగారంలా మారుతుంది.

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balkrishna)కు ఈ ఏడాది పట్టిందల్లా బంగారంలా మారుతుంది. ఈ మధ్యనే పద్మ భూషణ్ గౌరవాన్ని అందుకున్న బాలయ్య.. తాజాగా జాతీయ అవార్డును అందుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం 71 వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రానికి గాను బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari)సినిమా ఎంపికైంది. దీంతో ఇండస్ట్రీలో సంబురాలు అంబరాన్ని అంటాయి.


అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యకి కూతురుగా శ్రీలీల నటించింది. 2023 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక తాను నటించిన భగవంత్ కేసరి సినిమా జాతీయ అవార్డును అందుకోవడంతో బాలయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.


'71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో 'భగవంత్ కేసరి' ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం నాకు అపారమైన గర్వకారణం. ఈ గౌరవం మొత్తం మా చిత్ర బృందానికే చెందుతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ తరఫున చిత్ర నిర్మాతలు సాహు గారపాటి గారు, హరీష్ పెద్ది గారు, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి గారు, అలాగే ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు, సిబ్బంది అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. జాతీయ అవార్డుల జ్యూరీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారతదేశంలోని ఇతర జాతీయ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తివంతమైన కథలను అందించాలన్న మా తపనను మరింత బలపరుస్తోంది' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Updated Date - Aug 01 , 2025 | 09:22 PM