Balakrishna: తమ్ముడు పవన్.. బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 07:24 AM
సత్యసాయి జిల్లా సోమదేపల్లి మండల కేంద్రంలో ఆదివారం టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నేత ఎన్టీరామారావు విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది.
సత్యసాయి జిల్లా సోమదేపల్లి మండల కేంద్రంలో ఆదివారం టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నేత ఎన్టీరామారావు (NTR) విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ (MLA Balakrishna) వస్తున్నారని తెలియడంతో వీధులన్నీ జనంతో కిక్కిరిశాయి. ఆయన అభిమానులు ఆయనను చూడటానికి మిద్దెలు, మేడలెక్కి రాక కోసం ప్రతిక్షించారు.
కొత్తపల్లి క్రాస్ నుంచి ర్యాలీగా వచ్చిన బాలకృష్ణపై పూలవర్షం కురిపిస్తూ అభిమానులు నీరాజనం పలికారు. యాపిల్స్‌తో చేసిన గజమాలతో సత్కరించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకున్న బాలకృష్ణ విగ్రహా విష్కరణను అభిమానుల కేరింతల నడుమ ఘనంగా చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర రాజకీయ చరిత్రను తిరిగిరాసిన మహనీయుడు, పొలిటికల్ హీరో ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన రాకముందు బడుగు బలహీనవ ర్గాలకు ఎలాంటి రాజకీయ పదవులు దక్కలేదన్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తరువాత బీసీలకు పెద్దపీట వేసి అన్ని వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టారన్నారు. సినీ చరిత్రలో 50 ఏళ్లు హీరోగా రాణించిన ఘనత తనకు దక్కిందని మరో ఇంకో 20 సంవత్సరాలు హీరోగా నటిస్తూనే ఉంటానని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలే లక్ష్యంగా, ఆయన కలలను సాకారం చేస్తూ ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మన డిప్యూటీ సీఎం తమ్ముడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan), పెద్దల్లుడు నారా లోకేశ్ (Nara Lokesh) నాయకత్వంలో రాష్ట్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకెళుతున్నదని అన్నారు.