HBD Balayya: యన్టీఆర్ - ఏయన్నార్ ఇద్దరి బాటలో బాలయ్య!

ABN , Publish Date - Jun 09 , 2025 | 10:52 PM

నేడు 'నటసింహం'గా దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తున్న బాలకృష్ణను (Bala Krishna) ఆరంభంలో యన్టీఆర్ తనయుడైనా ఏయన్నార్ బాటలో పయనిస్తున్నాడు అనేవారు. యన్టీఆర్ స్వీయ (NTR) దర్శకత్వంలో 'అక్బర్ సలీమ్ అనార్కలి' సినిమాను నిర్మించారు

నేడు 'నటసింహం'గా దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తున్న బాలకృష్ణను (Bala Krishna) ఆరంభంలో యన్టీఆర్ తనయుడైనా ఏయన్నార్ బాటలో పయనిస్తున్నాడు అనేవారు. యన్టీఆర్ స్వీయ (NTR) దర్శకత్వంలో 'అక్బర్ సలీమ్ అనార్కలి' సినిమాను నిర్మించారు. ఈ సినిమా పూజాకార్యక్రమాల సమయంలోనే బాలకృష్ణను 'యన్టీఆర్ ఇంట ఏయన్నార్' (ANR) అని అక్కినేని ఆశీర్వదించారు. అందులో పొరపాటేమీ లేదు. నిజానికి బాలకృష్ణ కెరీర్ ను పరిశీలిస్తే మొదట్లో ఏయన్నార్ బాటలోనే పయనించినట్టు అనిపిస్తుంది. (Happy birthday NBK)

ఏయన్నార్ లాగే టీనేజ్ లోనే బాలకృష్ణ కూడా తన 14వ ఏట తొలిసారి తెరపై తళుక్కుమన్నారు. ఏయన్నార్ తన 17వ ఏట 1941లో 'ధర్మపత్ని' అనే సినిమాలో తొలిసారి కనిపించారు. తరువాత 'సీతారామజననం'లో శ్రీరాముని పాత్ర పోషిస్తూ హీరో అయ్యారు అక్కినేని. బాలకృష్ణ కూడా తరువాత 'రామ్-రహీమ్'తో అన్న హరికృష్ణతో కలసి ఓ హీరోగా నటించారు. తనయుడిని నటునిగా తీర్చిదిద్దడానికి యన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. తాను ధరించనటువంటి పాత్రల్లో ముందుగా బాలయ్యను నటింప చేశారు. అందులో భాగంగానే బాలయ్యతో వేములవాడ భీమకవి, అభిమన్యుడు, సలీమ్, నారదుడు, సిద్ధయ్య వంటి పాత్రలు పోషింప చేశారు. ఏయన్నార్ సుప్రసిద్ధుడైన సంస్కృత కవి కాళిదాసు పాత్రను పోషించారు. అలాగే ప్రఖ్యాత తెలుగు కవి భీమకవి పాత్రలో బాలయ్య నటించారు. 1955లో రూపొందిన తెలుగు 'అనార్కలి'లో ఏయన్నార్ సలీమ్ పాత్ర ధరించారు. అదే తీరున బాలయ్య 'అక్బర్ సలీమ్ అనార్కలి'లో సలీమ్ పాత్ర పోషించారు. 'భూకైలాస్, శ్రీకృష్ణమాయ' చిత్రాలలో నారదునిగా నటించారు ఏయన్నార్. 'శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం'లో బాలయ్యతో నారదుని వేషం వేయించారు యన్టీఆర్. ఇక యన్టీఆర్ అపూర్వ సృష్టిగా నిలచిన 'దానవీరశూర కర్ణ'లో అభిమన్యునిగా నటించి ఎంతగానో అలరించారు బాలకృష్ణ. ఇక్కడ కూడా ఏయన్నార్ ను గుర్తు చేసుకోవలసిందే - 1957 నాటి 'మాయాబజార్'లో ఏయన్నార్ అభిమన్యునిగా నటించారు. బాలయ్య 'శ్రీమద్విరాట పర్వం'లోనూ మరోమారు అభిమన్యునిగా కనిపించారు. ఏయన్నార్ పలు చిత్రాలలో భక్తుల పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు. 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర'లో బ్రహ్మంగారి ప్రియశిష్యుడు, భక్తుడు సిద్ధయ్య పాత్రలో అలరించారు బాలయ్య. ఇలా పలు విధాలా ఏయన్నార్ బాణీలోనే మొదట్లో బాలయ్య కెరీర్ సాగింది. అందువల్లే యన్టీఆర్ ఇంట ఏయన్నార్ అన్న మాట నిలచింది.


అయితే ఆ తరువాత తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ బాలకృష్ణ నాన్నలాగే శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో కనిపించి జనాన్ని ఆకట్టుకున్నారు. బాలయ్య కెరీర్ లో ఫస్ట్ సూపర్ డూపర్ హిట్ గా నిలచిన 'మంగమ్మగారి మనవడు'లో "చందురుడూ...నిన్నుచూసి..." అంటూ సాగే పాటలో బాలకృష్ణ తొలిసారి శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా తెరపై కనిపించగానే జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అంతకు ముందు మూడు ఫ్లాపులు పలకరించగానే, బాలకృష్ణ స్టార్ కాలేడు అని భావించిన వారందరూ 'మంగమ్మగారి మనవడు' ఘనవిజయం చూసి ముక్కున వేలేసుకున్నారు. ఆ తరువాత నుంచీ తండ్రి పోషించిన కొన్ని అరుదైన పాత్రలను ధరించి అలరించారు. 'పట్టాభిషేకం'లో ఓ పాటలో శ్రీకృష్ణునిగా, 'సాహస సామ్రాట్'లో ఓ సీన్ లో శ్రీరామునిగా మెప్పించారు. తరువాతి రోజుల్లో 'శ్రీకృష్ణార్జున విజయం'లో శ్రీకృష్ణ, అర్జున పాత్రల్లోనూ, ఆ పై 'పాండురంగడు'లో శ్రీకృష్ణునిగా, పుండరీకునిగా నటించి మురిపించారు బాలకృష్ణ. ఇక బాపు-రమణ చివరి చిత్రంగా వచ్చిన 'శ్రీరామరాజ్యం'లో శ్రీరామ పాత్రలో తండ్రిని తలపింప చేశారు బాలకృష్ణ. యన్టీఆర్ రౌద్రరస పాత్ర పోషణను గుర్తు చేస్తూ బాలయ్య నటించిన "బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్" చిత్రాలు ఎంతగా అలరించాయో చెప్పక్కర్లేదు. యన్టీఆర్ లాగే 'ఆదిత్య 369' సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర పోషించి ఎంతగానో ఆకట్టుకున్నారు బాలకృష్ణ. ఇక తండ్రి ధరించాలని ఆశించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' పాత్రను తన నూరవ చిత్రంలో ధరించి మెప్పించారు బాలకృష్ణ. ఈ నాటికీ జానపద చిత్రాల్లో అత్యధిక కేంద్రాలలో నాలుగు ఆటలతో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా బాలకృష్ణ 'భైరవద్వీపం' నిలచింది. ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య నటజీవితంలో ముందు ఏయన్నార్ లా కనిపించినా, తరువాత యన్టీఆర్ ముద్రనే విశేషంగా కనిపిస్తుంది. నాన్న నందమూరి తారక రామునిలాగే పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో విజయాలు చూసిన ఏకైక కథానాయకునిగానూ బాలకృష్ణ జేజేలు అందుకున్నారు. ఈ నాటికీ తండ్రి యన్టీఆర్ శైలిలోనే నటిస్తూ ఆయన లాగే అసంఖ్యాక అభిమానులను పోగేస్తూ బాలయ్య విజయపథంలో పయనిస్తున్నారు.

Updated Date - Jun 09 , 2025 | 10:53 PM