Nandamuri Balakrishna: బి. సరోజాదేవి మృతిపై బాలకృష్ణ సంతాపం
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:11 PM
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) మృతి చెందిన విషయం తెల్సిందే. ఆ వార్తనే ఇంకా జీర్ణించుకోలేకపోతున్న అభిమానులకు మరో పెద్ద షాక్ తగిలింది. నేడు సీనియర్ నటి బి. సరోజాదేవి (B. Sarojadevi) మృతి చెందారు.
Nandamuri Balakrishna: ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) మృతి చెందిన విషయం తెల్సిందే. ఆ వార్తనే ఇంకా జీర్ణించుకోలేకపోతున్న అభిమానులకు మరో పెద్ద షాక్ తగిలింది. నేడు సీనియర్ నటి బి. సరోజాదేవి (B. Sarojadevi) మృతి చెందారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేటి ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో ఇండస్ట్రీలో మరోసారి విషాద ఛాయలు అలమనుకున్నాయి. అలాంటి మేటి నటిమణుల్లో సరోజాదేవి కూడా ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి ఎంజీఆర్, రాజ్ కుమార్ లాంటి దిగ్గజ నటులతో నటించి మెప్పించిన నటీమణి బి. సరోజా దేవి.
ఇక బి. సరోజాదేవి మరణవార్త విన్న సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ సైతం.. బి. సరోజాదేవికి సంతాపం వ్యక్తం చేశాడు. ఫేస్ బుక్ ద్వారా బి. సరోజాదేవికి సంతాపం తెలిపాడు. ' దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒకనాడు ధ్రువతారగా వెలుగొందిన ప్రముఖ నటీమణి "పద్మభూషణ్" బి. సరోజాదేవి గారు పరమపదించారన్న వార్త అత్యంత బాధాకరం.అప్పట్లో తెలుగులో NTR గారితో, తమిళంలో MGR గారితో, కన్నడంలో రాజ్ కుమార్ గారితో ఏకకాలంలో హిట్ పెయిర్ గా వెలుగొందిన ఘనత ఆమెది.
మా తండ్రి NTR గారి కాంబినేషన్లో 20 సంవత్సరాల కాలంలో దాదాపు 20 చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. ఆయనతో శ్రీరాముడి ప్రక్కన సీతాదేవిగా, రావణాసురుడి ప్రక్కన మండోదరిగానూ నటించిన ప్రత్యేకత ఆమె సొంతం. శ్రీమతి బి. సరోజా దేవి మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు తీవ్ర విచారకరమైన పరిణామం. ఆమె వెండితెరపై మరియు నిజజీవితంలో చేసిన సేవలు రాబోయే తరాల తారలకు, చలనచిత్ర వర్గాల వారికి స్ఫూర్తినిస్తాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను' అంటూరాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.