Nandamuri Balakrishna: అవును.. నన్ను చూసుకొని నాకే పొగరు
ABN , Publish Date - Jun 10 , 2025 | 05:09 PM
నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna) నేడు 65వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే.
Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna) నేడు 65వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా బాలయ్యకు విషెస్ తెలుపుతున్నారు. ఇక ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా బాలయ్య.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో చిన్నారుల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ ను జరుపుకున్నాడు. కేక్ కట్ చేసి చిన్నారులకు ఫ్రూట్స్, స్వీట్స్, గిఫ్ట్స్ అందించాడు.
అనంతరం బాలయ్య మాట్లాడుతూ.. " నంబర్స్ ను నేను నమ్మను కాబట్టి నా వయస్సు ఎవరికి చెప్పను. అంటే ఎవరికి తెలియనిది కాదు. నా మొబైల్ నంబర్ కూడా అందరికీ తెల్సిందే. నాదంతా ఓపెన్ బుక్ నే. నా గురించి రహస్యాలు ఏమి ఉండవు. నా జీవితంలో నేను వేసే ప్రతి అడుగు అందరికీ తెల్సిందే. నా జీవితంలో యాదృచ్చికంగా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటివి ఎన్నోసార్లు చెప్పాను.
ఇంటర్ అయ్యి ఖాళీగా ఉన్న సమయంలో నాన్నగారు ఒకరోజు.. ఏరా ఏం చేస్తున్నావ్ అని అడిగారు. ఏం లేదు నాన్న ఇంటర్ అయ్యింది అన్నాను. మెడిసన్ ఎంట్రన్స్ రాస్తావా అని అడిగారు. చిన్నప్పటి నుంచి హీరో అవుతావని ఈయనే ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మళ్లీ మెడిసన్ ఏంటి అని అనుకున్నాను. మెడిసన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి అప్లై చేసి రాసాను. ఆ తరువాత అలా అలా సినిమాల్లో నటిస్తూ వచ్చేసాను. సింహా సినిమాలో మొదటిసారి డాక్టర్ గా నటించాను. అదే ఏడాదిలో బసవతారకం హాస్పిటల్ కి ఛైర్మెన్ అయ్యాను. అలా యాదృచ్చికంగా జరిగింది. ఈ 64 ఏళ్లలో నాకు పద్మ భూషణ్ రావడం, అలాగే ఇండస్ట్రీలో హీరోగా 50 ఏళ్లు పూర్తిచేసుకోవడం ఒక రికార్డ్. ప్రపంచంలో ఎవరు ఆ రికార్డ్ ను పొందలేదు. ఆ ఘనత నాకు దక్కింది. అదంతా నా తల్లిదండ్రుల ఆశీస్సులు. నా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాను.
ఇక మనం నాలుగు సినిమాలు హిట్లు ఇచ్చాం. అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. రేపు అఖండ 2 తాండవం. ఓ సందర్భంలో నేనొకసారి చెప్పాను. ఇకనుంచి చూపిస్తాను బాలకృష్ణ అంటే ఏంటో.. చాలామంది ఇకనుంచి చూపించడం ఏంటి. నాలుగు హిట్స్ ఇచ్చాడుగా అని అనుకున్నారు. కాదు.. అందరు రిటైర్ అయ్యో.. దారి మరల్చి సపోర్టివ్ రోల్స్ లోనో నటిస్తున్నారు. కానీ, ఇకనుంచి హీరోగానే ముందు ముందు చూపిస్తాను. పట్టుదల ఉండాలి. ఈ పట్టుదలను బయటివారు రకరకాలుగా అనుకోవచ్చు. నాకు పొగరు అనుకోవచ్చు. అవును.. నాకు పొగరు. నన్ను చూసుకొని నాకే పొగరు. బిరుదులకు నేను అలంకారమేమో కానీ, నాకు బిరుదులూ అలంకారం కాదు. అలాంటివి వస్తుండాయి.. పోతుంటాయి. మనం వాటిని పట్టించుకోకుండా కష్టపడి పనిచేయాలి" అంటూ చెప్పుకొచ్చాడు.