NBK 111: మహారాజుగా బాలకృష్ణ.. మహారాణిగా నయనతార
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:43 PM
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీలో బాలకృష్ణ మహారాజాగా కనిపిస్తారని వినిపిస్తోంది.
NBK 111: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీలో బాలకృష్ణ మహారాజాగా కనిపిస్తారని వినిపిస్తోంది. ఇందులో నయనతార (Nayanthara) నాయికగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి దాకా బాలకృష్ణతో నయనతార నటించిన 'సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా' మూడు చిత్రాలు శతదినోత్సవం చూడడం విశేషం... వీటిలో 'సింహా' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. ఈ నేపథ్యంలో నాలుగోసారి నయనతార బాలయ్యతో జోడీ కట్టడం విశేషంగా మారింది. త్వరలోనే బాలయ్యతో గోపీచంద్ మలినేని మూవీ సెట్స్ కు వెళ్ళనుంది.
తెలుగునాట ఆల్ రౌండర్ అంటే ఒకే ఒక్క నటరత్న యన్టీఆర్ అనే చెప్పాలి. పౌరాణిక, జానపద,చారిత్రక, సాంఘిక చిత్రాలలో ఆయన సాధించిన అరుదైన విజయాలు అనితరసాధ్యంగా నిలిచాయి. ఆ స్థాయిలో కాకపోయినా తరువాతి తరం స్టార్ హీరోస్ లో తండ్రిలాగే మైథలాజికల్, ఫోక్లోర్, హిస్టారికల్, సోషల్ మూవీస్ తో మురిపించిన ఏకైక హీరోగా నిలిచారు బాలకృష్ణ. ఈ నేపథ్యంలో ఆయన మహారాజాగా కనిపించబోవడం ఫ్యాన్స్ కు ఆనందం పంచుతోంది. గతంలో బాలయ్య మహారాజు గెటప్ లో కనిపించిన తొలి చిత్రం 'ముద్దుల క్రిష్ణయ్య', పూర్తి స్థాయిలో బాలయ్య నటించిన జానపదం 'భైరవద్వీపం' సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. అందువల్ల గోపీచంద్ మలినేని మూవీలో బాలయ్య మరోమారు మహారాజాగా కనిపించనున్నారని తెలియగానే ఫ్యాన్స్ లో ఆనందం చిందులు వేస్తోంది.
బాలకృష్ణతో బోయపాటి శ్రీను రూపొందించిన నాలుగో చిత్రంగా 'అఖండ-2' వస్తోంది. ఇప్పటి దాకా బాలయ్యతో బోయపాటి రూపొందించిన 'సింహా, లెజెండ్, అఖండ' మూడు చిత్రాలు బంపర్ హిట్స్ గా నిలిచాయి... బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తోన్న నాలుగో మూవీ 'అఖండ-2' కూడా అదే రీతిన హిట్ గా నిలుస్తుందని అభిమానుల అభిలాష. ఈ మూవీ బాలయ్య 110వ చిత్రంగా తెరకెక్కింది. ఇక బాలయ్య 111వ సినిమాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందే మూవీ రానుంది. చాలా రోజులుగా బాలయ్య 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్ గా 'ఆదిత్య 999' వస్తుందని వినిపిస్తోంది. ఇందులో బాలకృష్ణ మహారాజాగా కనిపిస్తారనీ తెలుస్తోంది. బహుశా, అదే చిత్రాన్ని గోపీచంద్ తెరకెక్కిస్తారా అని డౌట్. అయితే, బాలయ్య కోసం గోపీచంద్ ఓ కొత్త సబ్జెక్ట్ ను రూపొందించారనీ వినికిడి. ఏది ఏమైనా బాలకృష్ణ మహారాజాగా కనిపించబోయే చిత్రంలో నయన్ మహారాణిలా తళుక్కుమనేలా ఉంది. ఈ సారి బాలయ్య-నయన్ కాంబో ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.
Santhana Prapthirasthu: ఫర్టిలిటీ సెంటర్స్ నుంచే సంతాన ప్రాప్తిరస్తు షురూ అయింది
Meesala Pilla Song Records: 13 రోజులు.. 36 మిలియన్ల వ్యూస్..