Akhanda 2: ఏపీలో బాలయ్య 'అఖండ 2'.. జాతర షురూ
ABN , Publish Date - Dec 02 , 2025 | 10:40 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అఖండ తాండవంకు ఉన్న మేనియాను దృష్టిలో ఉంచుకుని, డిసెంబర్ 4న సినిమా ప్రీమియర్ షోలు వేసుకోవడానికి ప్రత్యేక అనుమతిని మంజూరు చేసింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌ను నమోదుచేయగా, ఇపుడు నాలుగోసారి రాబోతున్న అఖండ తాండవం (Akhanda 2) కూడా ఇండస్ట్రీలో అంచనాలను భారీగా పెంచేసింది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో, గత కొన్ని రోజులుగా దీని ప్రీమియర్లకు సంబంధించిన చర్చలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, ఈ చిత్రబృందం ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపగా... ఫైనల్‌గా వారికి శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అఖండ తాండవంకు ఉన్న మేనియాను దృష్టిలో ఉంచుకుని, డిసెంబర్ 4న సినిమా ప్రీమియర్ షోలు వేసుకోవడానికి ప్రత్యేక అనుమతిని మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాత్రి వేళల్లో, విడుదల తేదీకి ఒక రోజు ముందే తమ అభిమాన హీరో చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం దక్కడంతో, అఖండ వేడుకలు ముందస్తుగానే మొదలయ్యాయి. ఈ ప్రీమియర్స్ కోసం టికెట్ రేటును రూ. 600గా నిర్ణయించారు. ఈ భారీ రేటు కూడా అభిమానులను అడ్డుకోలేకపోయింది. సినిమాకు వచ్చిన భారీ డిమాండ్ దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం, పది రోజుల పాటు సినిమా టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును చిత్రయూనిట్‌కు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై 75 రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ ధరపై 100 రూపాయల వరకు అదనంగా పెంచుకునే అవకాశాన్ని కల్పించింది.
ఈ నిర్ణయం చిత్ర నిర్మాతలకు భారీ ఊరటనిచ్చిందనే చెప్పాలి. 'అఖండ' విజయంపై చిత్ర బృందం ఎంత నమ్మకంతో ఉందో, ఈ జీవో ద్వారా వచ్చే అదనపు ఆదాయం వారికి ఎంతవరకు మేలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణలో కూడా అఖండ హంగామా ఏ మాత్రం తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే, ఇక్కడ కూడా టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు కోసం నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాకుండా, డిసెంబర్ 4న హైదరాబాద్‌తో సహా ప్రధాన నగరాల్లో ముందస్తు ప్రీమియర్స్ వేయడానికి అనుమతి లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీనిపై తుది ప్రకటన కోసం నందమూరి అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.