Baahubali Team: బాహుబలి మళ్లీ వస్తున్నాడు
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:46 AM
భారతీయ సినీ చరిత్రలో ‘బాహుబలి’కి ఎంతటి ప్రత్యేక స్థానం ఉందో చెప్పక్కర్లేదు.
భారతీయ సినీ చరిత్రలో ‘బాహుబలి’కి ఎంతటి ప్రత్యేక స్థానం ఉందో చెప్పక్కర్లేదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సినిమా మొదటి భాగం విడుదలై 10 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.ఎ్‌స.రాజమౌళి అభిమానులకు తీపికబురందించాడు. ‘బాహుబలి: ద బిగినింగ్’, ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’.. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ద ఎపిక్’గా అక్టోబర్ 31న రీ రిలీజ్ చేయనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘బాహుబలి.. ఎన్నో అద్భుతమైన ప్రయాణాలకు ఆరంభం. లెక్కలేనన్ని జ్ఞాపకాలను ఇచ్చింది. ఎంతోమందికి స్ఫూర్తిని పంచింది. ఈ సినిమా రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ద ఎపిక్’ పేరిట మరోసారి మీ ముందుకు తీసుకువస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియుల ఆనందం రెట్టింపైంది. చిత్రం విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా బుధవారం రాత్రి ‘బాహుబలి’ టీమ్ రీ యూనియన్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణతో సహా టోటల్ టీమ్ పాల్గొన్నారు. రమ్యకృష్ణ సినిమాలోని తన డైలాగు ‘ఇది నా మాట. నా మాటే శాసనం’ అనే ఫ్లకార్డు పట్టుకుని ఫోజివ్వడం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, 2015లో ఈ సినిమా ప్రచారంలో భాగంగా రాజమౌళి వాడిన ‘బాహుబలి వస్తున్నాడు’ అనే హ్యాష్‌టాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.