సహజమైన అందం... అరుదైన అభినయం
ABN , Publish Date - Jul 15 , 2025 | 06:07 AM
ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషలను ఏలిన అందాల కథానాయిక బి.సరోజాదేవి. మిగిలిన రెండు భాషలతో పోలిస్తే తెలుగులో తక్కువ సినిమాలే చేసినా తన...
సహజమైన అందం... అరుదైన అభినయం
ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషలను ఏలిన అందాల కథానాయిక బి.సరోజాదేవి. మిగిలిన రెండు భాషలతో పోలిస్తే తెలుగులో తక్కువ సినిమాలే చేసినా తన ముద్దు ముద్దు మాటలతో, సౌందర్యంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సరోజాదేవి. తెలుగులో ఎన్టీఆర్, ఏయన్నార్, తమిళంలో ఎమ్జీఆర్, శివాజీగణేశన్, కన్నడంలో రాజ్‌కుమార్.. ఇలా మూడు భాషల్లో దిగ్గజ నటులతో నటించి ప్రేక్షకుల అభిమానం పొందారామె. ముఖ్యంగా 1955 నుంచి 84 వరకూ 29 ఏళ్ల పాటు వరుసగా 161 చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించి చరిత్ర సృష్టించారు సరోజాదేవి. ఇవాళ షష్ఠి పూర్తి చేసుకున్న మగమహారాజులకు వాళ్ల యవ్వన కాలంలో ఆకట్టుకొని అలరించిన కథానాయిక సరోజాదేవి.
నటన అన్నా, సినిమాలు అన్నా ఆసక్తి లేని సరోజాదేవి నటిగా పరిచయం కావడం, గ్లామర్ కథానాయికగా పేరు తెచ్చుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ వాళ్ల నాన్నగారికి నాటకాలంటే ఇష్టం కావడంతో సరోజాదేవితో ఓ నాటకంలో బాలకృష్ణుని వేషం వేయించారు. చక్కగా అలంకరించుకుని ముద్దు ముద్దు మాటలతో సరోజాదేవి అందరినీ ఆకట్టుకున్నారు. ఒకసారి స్కూల్ వార్షికోత్సవంలో ‘ఏ జిందగీ’ అని పాడుతూ అభినయించడం ప్రేక్షకుల్లో ఉన్న హోన్నప్ప భాగవతార్‌కు నచ్చింది. ఆయన ఆ సమయంలో (1955)లో మహాకవి కాళిదాస’ చిత్రం తీసే సన్నాహాల్లో ఉన్నారు. అందులో కథానాయిక విద్యాధరి పాత్ర సరోజాదేవితో వేయించాలని నిర్ణయించుకున్నారు. సరోజకు ఇష్టం లేకపోయినా తల్లితండ్రుల బలవంతం మీదే తన 13వ ఏట ఆ చిత్రంలో నటించారు. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో సరోజ కూడా నటన పట్ల ఆసక్తి పెంచుకున్నారు.
ఆ పదేళ్లు ఏలేశారు
ఎన్టీఆర్ నటించి, నిర్మించిన ‘పాండురంగ మహాత్మ్యం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ సరసన ఎక్కువ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఏయన్నార్ సరసన ఐదు చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో నటించే అవకాశం ఆవిడకు వచ్చింది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌కు సోదరిగా నటించి ‘చిన్నన్నయ్యా’ అని ముద్దు ముద్దుగా పిలవడం ఆ రోజుల్లో ఆడపిల్లలకు పెద్ద క్రేజ్.. సరోజాదేవి కెరీర్‌లో మరపురాని కాలం అరవయ్యవ దశాబ్దం. ఆ పదేళ్ల కాలంలో దక్షిణాదిన మకుటం లేని మహారాణిలా వెలిగారు. ఆ రోజుల్లో ఆమెను అంధ్రుల అందాల తార అని, ‘ఆంధ్రా క్లియోపాత్ర’ అని పిలిచేవారు. ఆ సమయంలో దక్షిణాదిలో ఆవిడ హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ కూడా. తదనంతర కాలంలో ముఖ్యమంత్రులైన ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలితతో సరోజాదేవి కలసి నటించడం ఒక విశేషం. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత హీరో కృష్ణ నిర్మించిన ‘పండంటి కాపురం’ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టి్‌స్టగా ఆవిడ కొనసాగారు. హీరో కృష్ణంరాజు నిర్మించిన ‘యమధర్మరాజు’ చిత్రంలోనూ సరోజాదేవి కీలక పాత్ర పోషించారు.
అభినయ సరస్వతి
తమిళ సినీ ప్రేక్షకుల హృదయాల్లో ‘అభినయ సరస్వతి’గా చెరగని ముద్ర వేసుకున్న బి.సరోజాదేవి కోలీవుడ్‌లోనూ అగ్రనటిగా కొనసాగారు. ఎంజీ రామచంద్రన్, నడిగర్ తిలగం శివాజీ గణేశన్‌లతో కలిసి అత్యధిక చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్‌తో 26 చిత్రాలు, శివాజీ గణేశన్‌తో 22 చిత్రాల్లో నటించిన సరోజాదేవి ఆ తర్వాత జెమిని గణేశన్, ఎస్‌ఎస్ రాజేంద్రన్, ముత్తురామన్, ఏవీఎం రాజన్, రవిచంద్రన్ వంటి ప్రముఖ నటులతో అనేక చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్‌తో కలిసి ఆమె నటించిన చివరి చిత్రం ‘అరస కట్టలై’ (1967). 1960-70 దశకంలో పద్మిని, సావిత్రి, సరోజాదేవి అగ్రహీరోయిన్లుగా కొనసాగారు. సరోజాదేవి నటించిన తన వందో చిత్రం ‘పెణ్ ఎండ్రాన్ పెణ్’ తమిళంలో రూపుదిద్దుకోవడం గమనార్హం. తమిళంలో ఆమె చివరిసారిగా 2009లో వచ్చిన ‘ఆదవన్’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో సూర్య - నయనతార జంటగా నటించారు..
పదవులు.. పురస్కారాలు
బి.సరోజాదేవికి 1969లో కేంద్రప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. 1992లో ఆమెను పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాల నుంచి నాలుగుసార్లు ఉత్తమ నటిగా అవార్డులు అందుకొన్నారు సరోజాదేవి. 1989లో కర్నాటక ప్రభుత్వం నుంచి రాజ్యోత్సవ అవార్డు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ అవార్డ్‌తో, తమిళనాడు ప్రభుత్వం ఎమ్జీఆర్ అవార్డ్‌తో ఆవిడను సత్కరించాయి. 1989లో కేంద్రప్రభుత్వం ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా అవార్డ్‌తో గౌరవించింది. బెంగళూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఇక సరోజాదేవిని వరించిన పదవుల విషయానికి వస్తే.. 1981లో కర్నాటక చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కంఠీరవ స్టూడియోకు ఛైర్మన్‌గా ఆవిడ వ్యవహరించారు. అప్పట్లో ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ మాండ్యా లోక్‌సభ స్థానానికి పార్టీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినా, రెండు పడవల ప్రయాణం తనకు ఇష్టం లేదని సున్నితంగా తిరస్కరించారు సరోజాదేవి. ఆవిడకంటే అందగత్తెలు, గ్లామర్ నటీమణులు ఎవరూ లేరా అంటే.. ఉండొచ్చు కానీ ఓ తరం వారి హృదయాల్లో రోజూ దీపం వెలిగించిన ఘనత మాత్రం కచ్చితంగా సరోజాదేవిదే! అవిడ చిలుక పలుకులు, కన్నులు తిప్పే తీరు ఇప్పటికీ వెంటాడుతునే ఉంటాయి.
ఆ ఇద్దరితో వాన పాట
ఎన్టీఆర్, ఏయన్నార్ నటించిన చిత్రాల్లో వాన పాటల్లో మురిపించిన తారగా సరోజాదేవి నిలిచారు. ‘ఆత్మబలం’ (1964)లోని చిటపట చినుకులు పడుతూ ఉంటే’ పాటలో ఏయన్నార్‌కు జోడీగా నటించిన సరోజాదేవి తన అందంతో ప్రేక్షకులను కట్టి పడేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ‘భాగ్యచక్రం’ (1968)లో ‘వాన కాదు వాన కాదు.. వరదా రాజా’ పాటలోనూ సరోజాదేవి అందం ప్రేక్షకులకు బంధాలు వేసింది. ‘చిటపట చినుకులు’ పాట చిత్రీకరించే సమయానికి సరోజాదేవికి 104 డిగ్రీల జ్వరం. అంత జ్వరంలోనూ ఆవిడ ఆ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ పాటలో సరోజాదేవి వర్షంలో పెద్దగా తడవకుండా ఓ పెద్ద కర్చీఫ్ తలకు చుట్టారు. సినిమా విడుదలయ్యాక అలా కర్ఛీ్‌ఫను తలకు చుట్టుకోవడం ఓ ఫ్యాషన్‌గా భావించి ఆ రోజుల్లో చాలా మంది యువతులు ఫాలో కావడం విశేషం.