Ari: ‘హనుమాన్’, ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. అంచనాలు పెంచేశారే
ABN , Publish Date - Oct 08 , 2025 | 08:02 PM
‘హనుమాన్’, ‘మిరాయ్’ తరహాలో మరో డివైన్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అరి’ మూవీ అక్టోబర్ 10న విడుదల కానుంది.
ఇటీవల తెలుగు చిత్రసీమలో ఒక కొత్త తరహా ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది – దైవత్వాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకుంటున్నాయి. ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ వంటి సినిమాలు ఈ దారిలోనే వెళ్ళి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో మరో చిత్రం 'అరి' ARI (My Name is Nobody) విడుదలకు సిద్ధమవుతోంది.
ఇటీవల.. ట్రైలర్‌లోనే దేవుడి ఎంట్రీ హింట్ ఇవ్వడం, దైవిక అంశాలను హైలైట్ చేయడం హాట్ ట్రెండ్ అయిపోయింది. ‘అరి’ ట్రైలర్ కూడా అదే పంథాలో సాగింది. ఆరు ప్రధాన పాత్రలు, వారి కథలన్నింటికీ కృష్ణుడిని సూత్రధారిగా చూపించడం ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా, “కృష్ణుడు నేల మీదికి దిగాడు” అన్నట్టుగా చూపించిన షాట్ గూస్‌బంప్స్ కలిగించేలా ఉంది.
ఈ సినిమా ప్రధానంగా "షడ్వర్గాలు" కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు పురాణాల కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించారు. దర్శకుడు ఈ కాన్సెప్ట్‌పై ఏకంగా ఏడేళ్ల పరిశోధన చేయడం విశేషం. పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రీయ గ్రంథాల నుంచి కథకు కావాల్సిన అనేక విషయాలపై పరిశోధనలు చేసి దాన్ని ఆధునిక జీవితానికి అనుసంధానం చేస్తూ ‘అరి’ కథను తయారు చేయడం విశేషం. దీనిని కేవలం ఒక కమర్షియల్ సినిమాగా మాత్రమే కాకుండా, ఆలోచింపజేసే కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా.. 'అరి' ట్రైలర్ చూసినవారిలో ఇప్పటికే ఉత్కంఠ, ఆధ్యాత్మిక ఆసక్తి కలుగుతోంది. పాత పురాణ గాధలను ఆధునిక నేపథ్యంలో చెప్పే ప్రయత్నం కచ్చితంగా ప్రేక్షకుల మనసును తాకేలా ఉంది. 'హనుమాన్' తరహాలో మరో డివైన్ యాక్షన్ డ్రామాగా 'అరి' కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందా? అన్నది చూడాలి. ఇదిలాఉంటే.. ఈ చిత్రంలో వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి నటులు కీలక పాత్రలు పోషించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అక్టోబర్ 10న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.