Kandula Durgesh: ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్’లో కందుల దుర్గేశ్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:20 PM
సినిమా షూటింగ్‌లకు, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక కొత్త అధ్యాయాన్ని రచిస్తున్నామని, ఏపీ సినిమాటోగ్రఫీకి కొత్త శకం ఆరంభమైందని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
సినిమా షూటింగ్‌లకు, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక కొత్త అధ్యాయాన్ని రచిస్తున్నామని, ఏపీ సినిమాటోగ్రఫీకి (cinematography minister kandula Durgesh) కొత్త శకం ఆరంభమైందని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఏపీలో సమగ్రమైన కొత్త ‘ఫిల్మ్ టూరిజం పాలసీ’ని (Film tourism policy) ఆవిష్కరించడానికి వేగంగా పని చేస్తున్నామని తెలిపారు. ఇది ప్రొడక్షన్ నుండి ఎగ్జిబిషన్ వరకు తెలుగు సినిమా పరిశ్రమను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక విజనరీ డాక్యుమెంట్ అని అభివర్ణించారు. భారతదేశ వీడియా, ఎంటర్‌టైన్ మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే అవసరమైన ప్రోత్సాహం, భరోసా కల్పిస్తామని, కలిసి పనిచేద్దామని ఇన్వెస్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
ముంబయి జుహూలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో డిసెంబర్ 1, 2 తేదీల్లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ - 2025’లో రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఈ నెల 14, 15న విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామి సదస్సుతో పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక రంగంలో 98 ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. సముద్రతీరంలో వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు, పర్యాటక రంగంలో మెగా, ఆల్ర్టా మెగా ప్రాజెక్టులతోపాటు 2, 3 స్టార్ హోటళ్లు తెస్తున్నామన్నారు. ఎకో టూరిజంలో సమూల మార్పులు చేయబోతున్నట్లు చెప్పారు.
ఆయన మాట్లాడుతూ ‘హిందీ తర్వాత భారతదేశంలో తెలుగు సినీ పరిశ్రమ రెండవ అతిపెద్దదిగా నిలిచిందన్నారు. ఇది జాతీయ చలనచిత్ర పరిశ్రమకు దాదాపు 20ు వాటాను అందిస్తోందని స్పష్టం చేశారు. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, కల్కి 2898 ఏడీ, పుష్ప సిరీస్, సలార్, ఓజీ’ వంటి ప్రపంచ స్థాయి సినిమాలు కథా కథనం, విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ నాణ్యతలో అద్భుతంగా ఉండి బాక్సాఫీస్ కలెక్షన్లలో కొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేశాయన్నారు. తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చాయని తెలిపారు. తమిళనాడు తర్వాత అత్యధికంగా ఏపీలో 1,103 స్క్రీన్లు ఉన్నాయని, ఈ రంగానికి తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.
ప్రతిభకు పెద్దపీట వేస్తూ త్వరలోనే నంది అవార్డులు నంది నాటకోత్సవాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు, ఆధునికి స్టూడియోలు, డబ్బింగ్ మరియు రీ-రికార్డింగ్ సౌకర్యాలు నిర్మించే వెంచర్లకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. 2029 నాటికి రూ.25,000 కోట్లు ప్రైవేట్ పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే ఇప్పటికే దాదాపు రూ.24,000 కోట్ల పెట్టుబడుల పైప్‌లైన్‌ను కలిగి ఉందని, మరో రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతులు లభించాయని వివరించారు. వేగంగా పెరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల డిమాండ్‌ను తీర్చేందుకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 3500 గదులను 50 వేలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.