Anushka: తనొక డైమండ్.. అనుష్క అంటే ఇంత ఇష్టమా..
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:12 AM
‘సూపర్’, ‘విక్రమార్కుడు’లాంటి గ్లామర్ పాత్రలే కాదు... అనుష్క శెట్టి గుర్తుకొస్తే ‘అరుంధతి’, ‘బాహుబలి’వంటి అనేక చిత్రాల్లో ఆమె నట విశ్వరూపం దర్శనం ఇస్తుంది. అందుకే అనుష్కను సామాన్యులే కాదు... దర్శకులు కూడా ఇష్టపడతారు.
‘సూపర్’, ‘విక్రమార్కుడు’లాంటి గ్లామర్ పాత్రలే కాదు...
అనుష్క శెట్టి గుర్తుకొస్తే ‘అరుంధతి’, ‘బాహుబలి’వంటి అనేక
చిత్రాల్లో ఆమె నట విశ్వరూపం దర్శనం ఇస్తుంది. అందుకే
అనుష్కను సామాన్యులే కాదు... దర్శకులు కూడా ఇష్టపడతారు.
రెండేళ్ల విరామం తర్వాత ‘ఘాటీ’తో ప్రేక్షకుల ముందుకు
వచ్చిన ఈ ఎవర్‌గ్రీన్ హీరోయిన్‌తో... తమకున్న
అనుబంధాన్ని, ఆమెతో కలిసి పనిచేసినవారు ఇలా పంచుకున్నారు...
తనంటే గౌరవం
స్వీటీ (అనుష్క) గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... తను చుట్టూ జరిగే ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తుంటుంది. ‘విక్రమార్కుడు’ చేసినప్పుడు ప్రతీ షాట్‌ని చేసి చూపించమనేది. నేను చేసి చూపిస్తే, దాన్ని తనకు అనుగుణంగా మార్చుకుని చకచకా చేసేది. రవితేజతో ఉన్న రొమాంటిక్ సీన్స్ కూడా యాక్ట్ చేసి చూపించమనేది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే తను మా కుటుంబానికి బాగా దగ్గరైంది. ఒక వ్యక్తిగా, నటిగా తనంటే నాకు ఎంతో గౌరవం. నా హృదయంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంటుంది.
- ఎస్.ఎస్.రాజమౌళి
ఎందరికో స్ఫూర్తి
‘సూపర్’ కోసం హీరోయిన్ వేట మొదలెట్టిన రోజులవి. నా ఫ్రెండ్ చెబితే ముంబయి వెళ్లాను. హోటల్‌లో వెయిట్ చేస్తుండగా ఒక అమ్మాయి వచ్చింది. చూడగానే ఆకర్షణీయంగా అనిపించింది. ‘మీ ఫొటో ఏదైనా ఉంటే ఇవ్వండి’ అని అడిగితే.. పర్సులోంచి స్టాంప్ సైజులో ఉన్న ఒక ఫొటో ఇచ్చింది. నేను షాక్... నాకు అర్థమైపోయింది ఆమె సినిమా పక్షికాదని. ఆ తర్వాత తనని హైదరాబాద్ తీసుకువచ్చాం. ఎంతో శ్రద్ధగా యాక్టింగ్, డ్యాన్స్ నేర్చుకుంది. ‘సూపర్’ షూటింగ్ ప్రారంభమయ్యాక.. నాగార్జున ‘నీ పేరేంటి’ అని అడిగారు. ‘స్వీటి’ అని చెప్పింది. ‘ఈమెకు ఏదైనా పేరు పెడదాం’ అని ఆలోచిస్తుండగా మా సినిమాలో పాట పాడడానికి ఒక అమ్మాయి వచ్చింది. తన పేరు అనుష్క. ఆ పేరు అందరికీ నచ్చడంతో అనుష్క పేరు పెట్టాం. అలా ఏమీ తెలియని స్టేజ్ నుంచి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఎదిగిన తీరు అమోఘం. - పూరీ జగన్నాథ్
తనలాంటి వాళ్లు అరుదు
నేను, అనుష్క ‘సింగం’ కోసం మొదటిసారి కలిసి పనిచేశాం. చెప్తే నమ్మరు... సినిమా విడుదలైన రోజు మూవీ టీమ్ అంతా ఒక థియేటర్‌కు వెళ్లాం. నా ఎంట్రీ కన్నా తన ఎంట్రీ సీన్‌కే థియేటర్‌లో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఒకటే ఈలలు, చప్పట్లు. అనుష్క నటనకు, స్ర్కీన్ ప్రజెన్స్‌కు నేనే కాదు... జ్యోతిక కూడా ఫిదా అయిపోయింది. తను చాలా సింపుల్ పర్సన్. తనలాంటి వారు చాలా అరుదు.
- సూర్య
పెద్ద స్టార్ హీరో
అనుష్క ఎవరినైనా తన మంచితనంతో చంపేయగలదు. ‘అరుంధతి’ చూశాక తనకి పెద్ద ఫ్యాన్ అయిపోయా. తనకు చరిత్రలో కొన్ని పేజీలు కాదు... ఒక పుస్తకమే ఉంటుంది. నా దృష్టిలో తనొక పెద్ద స్టార్ హీరో. మేమిద్దరం ఒకరినొకరం సరదాగా ‘బ్రో’ అని పిలుచుకుంటాం.
- రానా దగ్గుబాటి
క్రేజీ అలవాటుంది...
నేను ఇప్పటివరకు చూసిన వాళ్లలో మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అనుష్క. నిజంగా తను ఒక డైమండ్. ఇండస్ట్రీలో నాకు సాయం చేసిన మొదటి హీరోయిన్ తనే. సెట్‌లో ఎంత జాలీగా ఉన్నా... టేక్ మొదలవ్వగానే చిటికెలో తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది. తను నవ్వడం మొదలెడితే... ఆపడం ఎవరితరం కాదు. అలా నవ్వుతూనే ఉంటుంది. ఆరోజుకి షూటింగ్ ప్యాకప్ చెప్పేయాల్సిందే. తనకు ఉన్న క్రేజీ అలవాటు ఏమిటంటే... ఫోన్‌ను ఎప్పుడూ సైలెంట్ మోడ్‌లోనే ఉంచుతుంది. మెసేజ్‌లు, కాల్స్ ఏమైనా వస్తే.. తర్వాత ఎప్పటికో చూసుకుని కాల్‌బ్యాక్ చేస్తుంది.
- తమన్నా