Paradha Trailer: పరదా ట్రైలర్.. ఈసారి అనుపమ హిట్ కొట్టేలానే కనిపిస్తుందే
ABN , Publish Date - Aug 09 , 2025 | 08:01 PM
ఇండస్ట్రీ మునుపటిలా లేదు. ఈ జనరేషన్ లో హీరో, హీరోయిన్ అనే తేడా లేదు. కథ.. కథనే హీరో.అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి మంచి కథలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి
Paradha Trailer: ఇండస్ట్రీ మునుపటిలా లేదు. ఈ జనరేషన్ లో హీరో, హీరోయిన్ అనే తేడా లేదు. కథ.. కథనే హీరో.అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి మంచి కథలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. స్టార్ హీరోలతో పాటు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా అభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా కుర్ర బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పరదా (Paradha). ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటి దర్శనా రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే పరదా సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు పరదా ఆగస్టు 22 న రిలీజ్ కు సిద్దమయ్యింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా పరదా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మొదటి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే.. అనుపమ ముఖాన్ని పరదాతో కప్పేయడంతో.. సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇదేదో మహిళా సాధికారితకు సంబంధించిన సినిమా అని పాజిటివ్ టాక్ ను అందుకుంది.
టీజర్, సాంగ్స్ లో కూడా ముగ్గురు మహిళలను హైలైట్ చేసి చూపించి.. అందరి దృష్టి సినిమాపై పడేలా చేశారు. ఇక ఇప్పుడు ట్రైలర్ లో కూడా పూర్తి కథను రివీల్ చేయకుండా ఒక ఉత్కంఠను రేకెత్తించారు. పరదాలు అమ్ముకుంటూ.. ఎప్పటికైనా పెళ్లి చేసుకొని తల్లి కావాలనుకొనే కోరిక ఉన్న అమ్మాయి సుబ్బు. వారి ఊరిలో ఒక ఆచారం ఉంటుంది. ఎవరూ ముఖంపియా ఉన్న పరదాను తొలగించి ముఖం చూపించకూడదు. అయితే అనుకోకుండా సుబ్బు.. తన ఊరు వదిలి వేరే రాష్ట్రం వెళ్తుంది. అక్కడ తనకు ఇంకో ఇద్దరు మహిళలు పరిచయమవుతారు.ముగ్గురు కలిసి సుబ్బు ఊరికి చేరుకుంటారు. అయితే సుబ్బు ఏదో తప్పు చేసిందని, ఆ ఊరి ఆచారం ప్రకారం ఆమెను ఆత్మాహుతి చేయడానికి ప్రయత్నిస్తారు. మరి ఆ దురాచారం నుంచి సుబ్బును ఎవరు కాపాడతారు.. ? అసలు సుబ్బు చేసిన తప్పు ఏంటి.. ? ఆ గ్రామంలో ఉన్న ఆచారం ఏంటి ..? చివరకు సుబు కల నెరవేరిందా.. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
అనుపమ వన్ విమెన్ షో అన్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్నా కూడా ఎక్కడో ఒకచోట ఆచారాల పేరుతో ఎంతోమంది అమాయక ఆడవారిని మానసిక వేదనకు గురిచేస్తున్నారు. ఈ సినిమాలో ఒకపక్క ఆచారాలకు కట్టుబడే హీరోయిన్ ను చూపిస్తూనే.. చదువుకొని.. సొంత కాళ్ల మీద నిలబడే అమ్మాయిగా దర్శనాను.. కుటుంబ బంధాలు మధ్య నలిగిపోయే గృహిణిగా సంగీతను చూపించారు. ఆడదానికి స్వేచ్ఛ అనేది ఇప్పుడున్న సమాజంలో ఎంతవరకు ఉంటుంది.. ? మహిళా సాధికారికతను ఈ సినిమాలో చాలా గట్టిగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు హైలైట్ గా గోపి సుందర్ మ్యూజిక్ నిలుస్తుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి పరదా ట్రైలర్ తోనే మంచి పాజిటివ్ వైబ్ ను అందుకుంది. మరి ఈ సినిమాతో అనుపమ మంచి హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.