Anupama Parameswaran: కమర్షియల్‌ సినిమాలో వెయ్యి తప్పులున్నా పట్టించుకోరు

ABN , Publish Date - Aug 25 , 2025 | 07:47 PM

అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కథానాయికగా నటించిన చిత్రం ‘పరదా’ (Paradha). దర్శకుడు ప్రవీణ్‌ కాండ్రేగుల (Praveen Kandregula) తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Paradha Thanks meet

అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కథానాయికగా నటించిన చిత్రం ‘పరదా’ (Paradha). దర్శకుడు ప్రవీణ్‌ కాండ్రేగుల (Praveen Kandregula) తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన థాంక్స్‌ మీట్‌ ఏర్పాటు చేశారు అనుపమ, ప్రవీణ్‌, రాగ్‌ మయూర్‌ తదితరులు పాల్గొన్నారు. అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ ‘నేను నటించిన చిత్రాల్లో ‘పరదా’ ఎంతో ప్రత్యేకం. నాకు బాగా ఇష్టమైన సినిమా ఇది. కొందరు ప్రేక్షకులు వినోదాత్మక చిత్రాలు చూడాలని కోరుకుంటారు. మరికొందరు కథాబలం ఉన్న ఇలాంటి సినిమాలపై ఆసక్తి చూపిస్తారు. ఎవరి ఇష్టం వారిది? ఎవరి అభిప్రాయం వారిది.  ‘పరదా’ని ఓ ప్రయోగాత్మక చిత్రంగా పేర్కొంటూనే కొందరు అందులో తప్పులు వెతుకుతున్నారు. సినిమానే కాదు వ్యక్తిగత జీవితంలోనూ మనం ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే  .. మిశ్రమ స్పందనే వస్తుంది. కమర్షియల్‌ చిత్రంలో 1000 తప్పులు ఉన్నా పట్టించుకోరు. కానీ, కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మేం పడిన కష్టాన్ని గుర్తిస్తే చాలని కోరుకుంటున్నా. మంచి చిత్రాలను ప్రోత్సహిస్తే ఇలాంటి కొత్త కంటెంట్‌ చిత్రాలు వస్తాయి’ అని అన్నారు.

 
'లేడీ ఓరియెంటెడ్‌ సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా తీశా. ప్రతి సినిమాలో పాజిటివ్‌, నెగెటివ్‌ ఉంటాయి. ‘పరదా’ విషయంలో భూతద్దంలో చూసి మరీ తప్పులు వెతికి, దాన్ని హైలైట్‌ చేస్తున్నారు. కథలో ఉన్న మంచిని వదిలేస్తున్నారు. సినిమా విడుదలై రోజులే అయింది. దాన్ని అప్పుడే జడ్జ్‌ చేయొద్దు. తెలుగులో ఇలాంటి కాన్సెప్టు సినిమా రాలేదని అనుకుంటున్నా. ముఖం కనిపించకుండా నటించేందుకు ఏ హీరోయిన్‌ అంగీకరిస్తుంది? కథను నమ్మి అనుపమ ఇందులో నటించింది. ఆమెకు జాతీయ అవార్డు రావాలని ఆకాంక్షిస్తున్నా’ అని దర్శకుడు ప్రవీణ్‌ కాండ్రేగుల భావోద్వేగానికి లోనయ్యారు. 

Updated Date - Aug 25 , 2025 | 07:47 PM