ANR: అక్కినేని కూతురు.. ఏవీ సుబ్బారావు కొడుకు... కళ్యాణం!
ABN , Publish Date - Oct 06 , 2025 | 08:14 PM
మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) - ఆయన పర్మినెంట్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత అనుమోలు వెంకట సుబ్బారావు (Anumolu Venkata Subba Rao) వియ్యంకులయ్యారు.
ANR: చిత్రసీమలో అంతా నటనే అనుకుంటే పొరబాటే! ఇక్కడ కూడా బంధాలు-అనుబంధాలు ఉంటాయి. మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) - ఆయన పర్మినెంట్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత అనుమోలు వెంకట సుబ్బారావు (Anumolu Venkata Subba Rao) వియ్యంకులయ్యారు. ఏయన్నార్ తో ఏవీ సుబ్బారావు నిర్మించిన తొలి చిత్రం 1959 నాటి 'ఇల్లరికం'. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. రజతోత్సవం చూసింది. ఆ తరువాత ఏయన్నార్ తో "భార్యాభర్తలు, కులగోత్రాలు, పునర్జన్మ, మనుషులు-మమతలు, నవరాత్రి, బ్రహ్మచారి, ఆదర్శ కుటుంబం, భార్యాబిడ్డలు, పల్లెటూరి బావ" వంటి చిత్రాలు నిర్మించారు ఏవీ సుబ్బారావు. ఆ తరువాతే 1974లో వారు వియ్యంకులయ్యారు.
ఏవీ సుబ్బారావు తనయుడు సత్యభూషణ్ రావు (Satya Bhushan Rao)తో, ఏయన్నార్ రెండో కూతురు నాగసుశీల (Naga Suseela) వివాహం 1974 జూన్ 10వ తేదీన మద్రాసులోని 'ఆబట్స్ బరీ' (Abbotsbury)లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో ఆ నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కరుణానిధి, మాజీ ముఖ్యమంత్రి కామరాజ్, ఏయన్నార్ కు ఆప్తమిత్రుడైన తమిళ స్టార్ హీరో శివాజీగణేశన్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. సత్యభూషణ్, నాగసుశీల ఏకైక పుత్రుడే ఈ నాటి యంగ్ హీరో సుశాంత్ (Sushanth). యాభై ఏళ్ళ క్రితం ఆ నాటి ప్రముఖ సినీపత్రిక 'సినిమారంగం'లో ప్రచురితమైన ఛాయాచిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు.
ఏయన్నార్, ఏవీ సుబ్బారావు వియ్యంకులైన తరువాత వారి కాంబోలో వచ్చిన చిత్రం 'ఆలుమగలు' (1977) మంచి విజయం సాధించింది. ఆ తరువాత మళ్ళీ ఏయన్నార్ తో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన సినిమా 'నాయకుడు-వినాయకుడు' (1980). ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన 'మనుషులు-మమతలు' (1965)తోనే జయలలిత (Jayalalitha) తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తెలుగునాట పలు విజయవంతమైన చిత్రాల్లో జయలలిత నటించారు. ఆమె నటించిన చివరి తెలుగు చిత్రం 'నాయకుడు-వినాయకుడు' కూడా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థనే నిర్మించడం, ఈ చిత్రాలలో ఏయన్నార్ హీరో కావడం విశేషం!
Vijay Devarakonda: బ్రేకింగ్.. విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
Dacoit: మళ్లీ వాయిదా పడ్డ డెకాయిట్..