Anasuya: రాబందుల్లా తయారయ్యారు.. మీడియాపై అనసూయ ఫైర్
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:36 PM
టాలీవుడ్(Tollywood)లో గత కొన్ని రోజులుగా నటుడు శివాజీ(Shivaji), నటి అనసూయ భరద్వాజ్(Nasuya Bharadwaj) మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
Anasuya: టాలీవుడ్(Tollywood)లో గత కొన్ని రోజులుగా నటుడు శివాజీ(Shivaji), నటి అనసూయ భరద్వాజ్(Nasuya Bharadwaj) మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. హీరోయిన్ల(Heroines) వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానలా మారి, ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, మీడియా(Media)పై ఆరోపణల వరకు వెళ్లాయి. శివాజీపై అనసూయ సీరియస్ అయ్యేసరికి చాలామంది.. ఆమె కుటుంబంపై మాటల దాడికి దిగారు. దీంతో మరోసారి అనసూయ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యింది.
‘హీరోయిన్లు నిండుగా బట్టలు వేసుకోవాలి’ అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలతో ఈ రచ్చ మొదలైంది. దీనిపై అనసూయ స్పందిస్తూ.. తన డ్రెస్సింగ్ విషయంలో ఎవరి సలహాలు అవసరం లేదని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీనికి శివాజీ వ్యంగ్యంగా స్పందిస్తూ, ‘మీ రుణం త్వరలోనే తీర్చుకుంటాను’ అనడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో అనసూయ చీరకట్టు ఫోటోలతో పాటు బికినీ వీడియోను కూడా షేర్ చేయడం, శివాజీని రెచ్చగొట్టేందుకేననే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.
తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఉద్దేశించి అనసూయ ఇన్ స్టాగ్రామ్(Istagram)లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టుకొచ్చింది. తన మాటలను కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని ఆమె మండిపడింది. ‘కొంతమంది రాబందుల్లాంటి వ్యక్తులు, బాధ్యతారహిత మీడియా సంస్థలు.. స్మార్ట్‌ఫోన్‌లు, మైకులు పట్టుకుని తిరిగే సామాజిక అక్షరాస్యత లేని వారు నా మాటలను వక్రీకరిస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టడం, సాధారణ పురుషులు-మహిళలను తప్పుదోవ పట్టించడం కోసమే ఇలాంటి మోసపూరిత కథనాలు సృష్టిస్తున్నారు.
నన్ను మాత్రమే కాకుండా, ఈ సంభాషణతో ఏమాత్రం సంబంధం లేని నా భర్తను మరియు నా పిల్లలను కూడా అవమానించడానికి ఒక విషపూరిత కథనాన్ని సృష్టించారు. నేను దుస్తులు ధరించే విధానం ఆధారంగా మాత్రమే, నా వ్యక్తిత్వాన్ని, నా నైతికతను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఇది ఎందుకు చేస్తున్నారో నాకు పూర్తిగా తెలుసు.. ఇలా చేసి మహిళలపై తమకు కంట్రోల్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. నేను ఎవరికి భయపడను' అంటూ చెప్పుకొచ్చింది.
తాజాగా శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్(Women Commission), ఆయనను విచారణకు పిలిపించింది. ఈ సందర్భంగా కమిషన్ శివాజీకి పలు ప్రశ్నలు సంధించింది. మహిళలపై మీరు చేసిన వ్యాఖ్యలు వారి గౌరవానికి, వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేలా ఉన్నాయని కమిషన్ భావిస్తోంది. దీనిపై మీ సమాధానం ఏమిటి?. ఒక సినిమా నటుడిగా మీరు చేసే వాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడారు?.
మహిళల వస్త్రాధారణ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాగ స్ఫూర్తికి విరుద్ధం. విద్యావంతుడైన మీకు ఈ విషయం తెలియదా?. మీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా లేవని మీరు భావిస్తే, దానికి తగిన ఆధారాలను లేదా వివరణను సమర్పించండి. మీ మాటలు మహిళలపై దాడులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు అని కమిషన్ ప్రశ్నించింది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు శివాజీ స్పందిస్తూ.. ఇకపై మహిళల విషయంలో ఎప్పుడూ చులకనగా మాట్లాడబోనని పేర్కొన్నారు.