Anasuya Viral Post: అనసూయ.. ఆంజనేయుడు వచ్చాడు.. ఎంత భాగ్యం..
ABN , Publish Date - May 19 , 2025 | 09:56 AM
యాంకర్‌గా, నటిగా వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న అనసూయ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు.
యాంకర్‌గా, నటిగా వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న అనసూయ (Anasuya) సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు. తాజాగా కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం (New House) చేశారు. తన కుటుంబంతో ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ‘ఆ సీతారామాంజనేయ కృపతో మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మా జీవితంలో మరో అధ్యాయం. కొత్త ఇంటి పేరు ‘శ్రీరామ సంజీవని’ (Sri Rama Sanjeevani) అంటూ అనసూయ ఫొటోలను పంచుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆసక్తికర పోస్ట్‌ను పంచుకున్నారు. మా ఇంటి దైవం ఆంజనేయస్వామి వచ్చారంటూ భావోద్వేగానికి గురవుతూ ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
‘‘ఈ ఫొటో వెనుక నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్న విషయం ఇదే. ఈ నెల 3న మేము మా కొత్త ఇంట్లోకి గృహ ప్రవేఽశం చేశాం, కొన్ని హోమాలు, పూజలు, వాస్తు హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం జరుపుకొన్నాం. చాలా పనులు ఉండటం వల్ల మొదట హోమం మొదలు పెట్టే ముందు మా గురువు గారిని కలిసి ఇంటికి ‘సంజీవని అని పేరు పెట్టుకోవాలనుకుంటున్నాం’ అని చెప్పాం. ఆయన ఓ 30 సెకన్లు కళ్లు మూసుకుని ‘శ్రీరామ సంజీవని అని పెట్టు’ అన్నారు. నేను మా ఆయన చాలా సంతోషంగా ‘బాగుంది గురువుగారు’ అని చెప్పాం. ఆ తర్వాత వాస్తు పురుషుడు, ఆయన ధర్మపత్ని పూజ చేయటానికి అటు పక్కకి వెళ్లాము. మరోవైపు గురువుగారు హోమం కొనసాగిస్తున్నారు. ఒక 20 నిమిషాలు దాటిన తర్వాత మా గురువుగారు వచ్చి తన ఫోన్ చూపిస్తూ ‘ఆంజనేయుడు వచ్చాడు’ అని అన్నారు. అంటే హోమంలో ఆంజనేయుడి రూపం కనిపించింది. ఆ సమయంతో మాకెంతో ఆనందం కలిగింది’’ అని అనసూయ పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారి నుంచి నేర్చుకున్న గొప్ప విషయం ఒకటి ఉంది. సంతోషం, దుఃఖం, భయాందోళన, అనారోగ్యం, ప్రేమ అన్నింటిలోనూ ‘జై హనుమాన్’ అని తలుచుకోకుండా నేనేమీ చేయను. నా కన్న తండ్రి తర్వాత ఆ హనుమంతుడినే నా తండ్రిగా భావిస్తానని నా ఆప్తులందరికీ తెలుసు. నా పెద్ద కొడుక్కి ‘శౌర్య’ అని ఆయన పేరు పెట్టుకున్నాం. అగ్ని దేవుడు ముక్కోటి దేవతలకు వార్తాహరుడు అని అంటారు. అందుకే ఏ దేవుడికి ఏమైనా గట్టిగా చెప్పుకోవాలన్నా హోమం ద్వారా చెప్పుకొంటాం. ఈ విధంగా ఆ రోజు హనుమాన్‌జీ మా ఇంటి పేరుని, మా ఇంటిని, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. అందరూ ఆధ్యాత్మికంగా ఉండరని నాకు తెలుసు. కానీ, నాకు ఎదురైనా సాక్షాత్కారాన్ని మీతో పంచుకోవాలనిపించింది. మీలో కొందరు నమ్మినా నమ్మక పోయినా ఆ ప్రహ్లాదుడు అప్పుడు చెప్పినట్లు.. ‘అందుగలడు ఇందులేడని సందేహం వలదు. ఎందెందు చూసినా అందందే గలడు’’ అని అనసూయ భావోద్వేగానికి గురైన ఫొటోలను పంచుకున్నారు.