Pawan Kalyan: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఎ.ఎం.రత్నం!
ABN , Publish Date - Jul 21 , 2025 | 01:57 PM
కొన్నేళ్ల తర్వాత సినిమా మీడియా ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాత ఎ.రత్నం మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు.
నిర్మాత ఎ.ఎం.రత్నం (AM Ratnam)అంటే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు (pawan Kalyan) ప్రత్యేక అభిమానం. అది ‘ఖుషి’ సినిమా సమయం నుంచి అలా కొనసాగుతూనే ఉంది. అదే అభిమానంతోనే తాను రాజకీయాలతో బిజీగా ఉన్నా, సమయం కేటాయించలేని స్థితిలో ఉన్నా రత్నం అడిగారని ఆయన బ్యానర్‌లో సినిమా అంగీకరించారు పవన్‌కల్యాణ్. అదే ‘హరిహర వీరమల్లు’. సినిమా మొదలై చాలా కాలమే అయినా గట్టున పడడానికి దాదాపు ఐదేళ్లు పట్టింది. నిర్మాత రత్నం సినిమా విషయంలో ఇబ్బంది పడుతున్నారని తెలిసి, ఆయన నలిగిపోవడం చూడలేక డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నా కూడా చిత్రీకరణకు దాదాపు రెండు నెలలు సమయం కేటాయించి సినిమా పూర్తి చేశారు పవన్. ఈ నెల 24న ‘హరిహర వీరమల్లు’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. (Ap FDC Chairman Am Ratnam)
ఈ సందర్భంగా చాలా ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్ ఈ సినిమా కోసం మీడియా ముందుకొచ్చారు. వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాత ఎ.రత్నం మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు. నిర్మాతగా సుధీర్ఘ అనుభవం, సినిమా ఇండస్ట్రీపై ఎంతో అవగాహన ఉన్న ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ప్రతిపాదించినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలిపారు. రత్నం లాంటి నిర్మాత ఇండస్ట్రీకి ఎంతో అవసరమని చెప్పారు. రత్నం గారు ఆ పదవిని పొందుతారని ఆశిస్తున్నానన్నారు. ప్రాంతాలవారీగా సినిమాను విడదీసి చూడలేనని, కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా ప్రతిభ ఉంటే ఏ ఇండస్ట్రీలో అయినా రాణించవచ్చని పవన్ చెప్పారు.
పవన్ సరసన నిధీ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రాన్ని నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రానికి క్రిష్ బలమైన ఇచ్చారని పవన్ అన్నారు. కథ మీద లోతుగా వర్క్ చేశారని గుర్తు చేశారు. పవర్‌ఫుల్ కథతో వచ్చిన ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ నెల 24న విడుదల కానున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని అన్నారు.