Allu Aravind: సింగిల్ మూవీ.. కలెక్షన్లలో కొంత ఆర్మీకి ఇస్తాం
ABN , Publish Date - May 09 , 2025 | 06:40 PM
శ్రీవిష్ణు హీరోగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సింగిల్. ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో మూవీ కలెక్షన్లలో కొంత భాగం ఆర్మీకి ఇవ్వనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు.
శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా కేతిక శర్మ (kethika sharma), ఇవానా (Ivana) కథనాయికలుగా నటించిన చిత్రం #సింగిల్ (Single Movie). గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు 'నిను వీడని నీడను నేను' ఫేమ్ కార్తిక్ రాజు (Caarthick Raju) దర్శకత్వం వహించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల ఆడియన్స్ నుంచి మంచి స్పందనను దక్కించుకుంటోంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ.. భారత్ మాతా కీ జై.. భారత్ పాక్ యుద్ద వాతావరణ నేపథ్యంలో సినిమా విజయాన్ని సెలబ్రేషన్ చేయాలనుకోవడం లేదని, మా పూర్తి మద్దతు ఎల్లవేళలా సైనికులకు ఉంటుందని అన్నారు. అంతేగాక సినిమాకు వచ్చే కలెక్షన్లలో కొంత భాగం ఆర్మీకి అందిస్తామని ప్రకటించారు.
సింగిల్ (Single Movie) సినిమా విడుదల తేదీ ప్రకటించాక దేశ వాతావరణం పూర్తిగా మారిపోయిందని అన్నారు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో అందరం కూర్చుని సినిమాను వాయిదా వేయాలని అనుకున్నాం కానీ అన్నీ కార్యక్రమాలు అప్పటికే జరిగిపోవడం, సినిమా అనేక వందల కుటుంబాలు ఆధారపడి ఉన్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేయలేక పోయామన్నారు. మా సపోర్ట్ మిలటరికీ ఉంటుందని, వారు అక్కడ పోరాటం చేస్తుంటే ఇక్కడ వేడుకలు చేసుకోలేమని అన్నారు. తాజాగా అల్లు అరవింద్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.