Akhanda 2 Thaandavam: ప్రధాని మోడీ కోసం.. 'అఖండ 2' ప్రత్యేక ప్రదర్శన

ABN , Publish Date - Dec 15 , 2025 | 09:58 AM

మనిషి అనుకుంటే గెలవవచ్చు ఓడవచ్చు. కానీ, దేవుడు తలచు కుంటే గెలుపు మాత్రమే ఉంటుంది. అలా దేవుడు గెలిపించిన సినిమా ఇది' అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు.

Akhanda 2 Thaandavam

'ప్రధాని మోదీ కోసం త్వరలో ఢిల్లీలో 'అఖండ 2స‌ (akhanda 2 thaandavam) సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నాం. మనిషి అనుకుంటే గెలవవచ్చు ఓడవచ్చు. కానీ, దేవుడు తలచు కుంటే గెలుపు మాత్రమే ఉంటుంది. అలా దేవుడు గెలిపించిన సినిమా ఇది' అని అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Sreenu). నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన చిత్రం 'అఖండ 2.తాండవం' ఇటీవలె విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రత్యేక వేడుకను నిర్వహించారు.

కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) మాట్లాడుతూ ' శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఒక పని కోసం కొందరిని ఆ పరమశివుడే ఎంచుకుంటాడు. మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది. 'ఆఖండ 2' సినిమా చూసిన ప్రేక్షకులు సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని చెబుతు న్నారు. మన ధర్మం. మన గర్వం, మన తేజస్సు కలగలసిన ఈ సినిమా ఆబాల గోపాలాన్ని అలరించిందని యావత్ ప్రపంచం కొనియాడుతోంది. ఇంతటి అఖండ విజయాన్ని ఇచ్చిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఆణిముత్యం. ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగ ప్రకంపనం. చరిత్రలో చాలా మంది ఉంటారు. సృష్టించిన చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాసి తిరిగి చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే. అది ఒక తెలియని శక్తి. 'ఎవరిని చూసుకొని రా బాలకృష్ణకు అంత పొగరు' అని చాలా మంది అంటుంటారు. నన్ను చూసుకొనే నాకు పదునైన పొగరు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొల్చే విప్లవం. నన్ను నేను తెలుసుకోవడమే. నా వృత్తే నా దైవం.

ఈ సినిమా కేవలం భాగవతానికి సంబంధించినది కాదు. ఒక బైబిల్, ఒక ఖురాన్ కి కూడా సంబంధించిన సినిమా' అని అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ 'మహిళలు, పిల్లలు ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తున్నారు' అని చెప్పారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు థమన్, గంగాధర శాస్త్రి, ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 10:11 AM