Akhanda 2: వంద కోట్ల క్లబ్‌లో అఖండ-2.. అది బాలయ్య రేంజ్

ABN , Publish Date - Dec 20 , 2025 | 07:26 PM

తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను తన మాస్ యాక్షన్‌తో పట్టి కుదిపేసిన చిత్రం అఖండ 2 తాండవం (Akhanda- 2 Thaandavam).

Akhanda 2

Akhanda 2: తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను తన మాస్ యాక్షన్‌తో పట్టి కుదిపేసిన చిత్రం అఖండ 2 తాండవం (Akhanda- 2 Thaandavam). నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబినేషన్‌ అంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం కామన్‌. ఇక ఇపుడు వచ్చిన అఖండ తాండవం కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. బాలయ్య అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూసిన ఈ చిత్రం తొలిరోజు నుంచే థియేటర్లలో భారీ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్‌లోనూ, ఇతర భారతీయ మార్కెట్లలోనూ ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా డీసెంట్ రన్‌ను కొనసాగిస్తూ, సక్సెస్‌ఫుల్ మైలురాయిని అధిగమించింది.

అఖండ 2 తాండవం సినిమాతో బాలయ్య అరుదైన రికార్డ్‌ను అందుకున్నాడు. అఖండ తరువాత నుంచి బాలయ్య చేసిన ప్రతి చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఇపుడు అఖండ తాండవం కూడా 100 కోట్ల మైలురాయిని అందుకుంది. ఈ విజయం బాలకృష్ణ కెరీర్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. అఖండ 1 తో మొదలైన ఈ వంద కోట్ల ప్రయాణం, అఖండ 2 తో మరింత వేగాన్ని అందుకుంది. తన నుండి వచ్చిన ప్రతి సినిమా రూ. 100 కోట్ల గ్రాస్‌ను పూర్తి చేసుకోవడం అనేది నిజంగా ఒక అరుదైన రికార్డు. ఈ రికార్డు బాలయ్య బాక్సాఫీస్ సామర్థ్యాన్ని, ఆయన మాస్ ఇమేజ్‌ను మరోసారి నిరూపించింది. 60 ఏళ్లు దాటినా, నేటి యువ హీరోలకు సైతం పోటీ ఇవ్వగల సత్తా ఆయనలో ఉందని ఈ విజయం గట్టిగా చెబుతోంది. బాలయ్య ఫ్యాన్స్‌కు ఇది గర్వకారణం.

అఖండ 2 విజయంలో కేవలం బాలయ్య మాస్ ఇమేజ్ మాత్రమే కాదు, సాంకేతిక బృందం అంకితభావం కూడ ఉంది. దర్శకుడు బోయపాటి తన ట్రేడ్‌మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌లను, భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ భారీ చిత్రంలో బాలయ్యతో పాటు సంయుక్త మీనన్, బాలనటి హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. విలక్షణ నటుడు ఆది పినిశెట్టి నెగిటివ్ రోల్‌లో సత్తా చాటారు. ఇక ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ మెయిన్‌ ప్లస్‌ పాయింట్‌ అనే చెప్పాలి. ముఖ్యంగా, అఖండ 2 నేపథ్య సంగీతం థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా 14 రీల్స్ ప్లస్ వారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. వారి నిర్మాణ విలువలు సినిమాకు గొప్ప రిచ్ లుక్‌ని ఇచ్చాయి. ఇక ఈ వార్త తెలియడంతో అది బాలయ్య రేంజ్ అని, ఇప్పట్లో బాలయ్య తాండవం ఆగదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.

Updated Date - Dec 20 , 2025 | 07:27 PM