Tollywood: బంగ్లా హిందువులకు దన్నుగా 'అఖండ 2' టీమ్
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:31 PM
బంగ్లా హిందువులకు 'అఖండ 2' బృందం సంఘీభావం తెలియచేసింది. కరుణ, మానవత్వమే శాంతిని కాపాడతాయని మేకర్స్ అభిప్రాయపడ్డారు.
బంగ్లాదేశ్ లో గత కొంతకాలంగా హిందువులను టార్గెట్ చేస్తూ హింసాత్మక సంఘటనలు పదే పదే జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం మైమెన్ సింగ్ లో చంద్రదాస్ (Chandra Das) అనే యువకుడిని దారుణంగా హతమార్చారు. దానిపై ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించిన ఆ దాడిని తీవ్రంగా ఖండించారు. తాజాగా 'అఖండ 2' (Akhanda 2) చిత్ర బృందం సైతం బంగ్లాలోని హిందూ సమాజానికి సంఘీభావం తెలిపింది. ఈ విషయమై 'అఖండ 2' చిత్ర బృందం సామాజిక మాధ్యమాలలో తన సందేశాన్ని పోస్ట్ చేసింది.

'మేం బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజంతో పాటు ఇటీవల జరిగిన హింస వల్ల ప్రభావితమైన అమాయక ప్రజలకు అండగా నిలుస్తున్నాం. సాధారణ పౌరులపై ఏ విధమైన హింస అయిన బాధకలిగించేదే. ఇది ఎవ్వరూ అంగీకరించలేనిది. బాధితులు, వారి కుటుంబాలకు మా సానుభూతిని తెలియచేస్తున్నాం. కరుణ, మానవత్వం ద్వారానే శాంతి, భద్రత వెల్లివిరుస్తాయని మేం ఆశిస్తున్నాం' అని ఆ సందేశంలో పేర్కొన్నారు. మరి బంగ్లా హిందువులపై జరుగుతున్న విచక్షణారహితమైన దాడిని ఇంకెవరైనా సినిమా ప్రముఖులు ఖండిస్తారేమో చూడాలి.