Akhanda 2 Tandavam: ఆలస్యమైనా.. తగ్గేదేలే! అఖండ.. టికెట్ రేట్ల పెంపు
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:59 PM
'అఖండ -2' సినిమాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించడానికి, టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి రెండు తెలుగు ప్రభుత్వాలు అనుమతి ఇస్తూ స్పెషల్ జీవోను జారీ చేశాయి.
గతవారం విడుదల కావాల్సిన నందమూరి బాలకృష్ణ 'అఖండ -2' (Akhanda 2) మరో గంటలో ప్రీమియర్స్ పడాల్సిన సమయంలో అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆసమస్యలు అన్నీ ఓ కొలిక్కి వచ్చేయడంతో ఈ వారమే సినిమాను థియేటర్లలో రిలీజ్‌కు రెడీ చేశారు. ఈ క్రమంలో ఓ రోజు ముందే ప్రీమియర్స్ సైతం వేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో 'అఖండ -2' (Akhanda 2) సినిమాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించడానికి, టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి రెండు తెలుగు ప్రభుత్వాలు అనుమతి ఇస్తూ స్పెషల్ జీవోను జారీ చేశాయి.

అయితే ఏపీలో 12వ తేదీ నుంచి పది రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్స్ కు 75 రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్లకు రూ.100 పెంచుకునే అవకాశం కల్పించగా, తెలంగాణలో మాత్రం కేవలం మూడు రోజులకే (శుక్ర, శని, ఆదివారాల్లో) మాత్రమే, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 100 పెంచుకోవచ్చని పేర్కొంది.
ఇక సినిమా విడుదలకు ఓ రోజు ముందుగా డిసెండర్ 11న రెండు రాష్ట్రాలలోనూ రాత్రి 8 గంటలకు బెన్‌ఫిట్ షోకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడమే కాక టికెట్ ధర రూ.600గా నిర్ణయించాయి.

ఇదిలాఉంటే.. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా టిక్కెట్ రేట్లు పెంచడం ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతాన్ని సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం వినియోగించాలని, ఆ మొత్తాన్ని సంబంధిత వర్గాలు ఎఫ్.డి.సి.లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొనడం విశేషం.
అయితే.. ప్రభుత్వాల నుంచి రేట్ల పర్మీషన్ జీవోలు వచ్చినప్పటికీ ఇంకా బుక్ మైషో ఇతర టికెటింగ్ యాప్‌లలో అఖండ 2 సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్‌లు ఆంధ్రలో స్టార్ట్ అవగా తెలంగాణలో మాత్రం ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం ఫ్యాన్స్‌ను ఆందోళనలకు గురి చేస్తున్నాయి.