Akhanda 2: 'అఖండ-2' దెబ్బ.. ఆ సినిమాలన్నీచెల్లా చెదురు! చివ‌ర‌కు మిగిలింది.. ఎన్నంటే

ABN , Publish Date - Dec 11 , 2025 | 08:10 AM

'అఖండ-2 - తాండవం' ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. డిసెంబర్ 12న వస్తోంది. ఓ రోజు ముందుగానే అంటే డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్ షోస్ పడనున్నాయి. దీంతో డిసెంబర్ 12న రావలసిన సినిమాలన్నీ చెల్లా చెదురయ్యాయనే చెప్పాలి..

Akhanda 2

నటసింహ నందమూరి బాలకృష్ణ, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న 'అఖండ 2 తాండవం (Akhanda 2) మొత్తానికి జనం ముందుకు వస్తోంది. డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కావలసిన 'అఖండ-2' అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే!. ఇప్పుడు అన్నీ క్లియర్ చేసుకొని డిసెంబర్ 12న ప్రేక్షకులను పలకరించనుంది. డిసెంబర్ 11వ తేదీ రాత్రి నుండే 'అఖండ-2' ప్రీమియర్ షోస్ మొదలు కానున్నాయి. ఈ సారైనా పక్కాగా వస్తుందా అన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి.

అయితే ఈ దఫా నిర్మాతలు సరైన జాగ్రత్తలు తీసుకొని 'అఖండ-2- తాండవం'ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్ సైతం ప్రారంభ‌మ‌య్యాయి. అయితే ముంద‌స్తు ఫ్లానింగ్ ప్ర‌కారం వాస్తవానికి డిసెంబర్ 12వ తేదీన దాదాపు 16 చిత్రాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. వాటిలో చాలా చిత్రాలు 'అఖండ-2' ఆగమనంతో తమ రిలీజ్ డేట్స్ మార్చుకున్నాయి.

డిసెంబర్ 12న వస్తున్న పదిహేను చిత్రాల్లో క్రేజ్ ఉన్నవి ఈషా, మోగ్లీ సినిమాలు, డబ్బింగ్ మూవీ 'అన్నగారు వస్తారు' ఉన్నాయి. వీటిలో 'మోగ్లీ' ఓ రోజు ఆలస్యంగా అంటే డిసెంబర్ 13న విడుదల కానుంది. కార్తి నటించిన 'అన్నగారు వస్తారు' మాత్రం అనుకున్న సమయానికే వస్తోంది. ఇక రజనీకాంత్ డిసెంబర్ 12వ తేదీన 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ నటించిన 'శివాజీ'ని రీ-రిలీజ్ చేయాలనుకున్నారు. థియేటర్ల కొరత వల్ల 'శివాజీ' కూడా పోస్ట్ పోన్ అయింది.

Akhanda 2

ఇక 12న రావలసిన 'సఃకుటుంబానాం' 19వ తేదీకి వెళ్ళింది. 'ఈషా' డిసెంబర్ 25న వస్తోంది. 'సైక్ సిద్ధార్థ్' జ‌న‌వ‌రి 1కి షిప్ట్ అయింది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే.. ఎలాంటి ప్ర‌చారాలు లేకుండానే నాలుగు రోజుల క్రితం టీజ‌ర్‌, రెండు రోజుల ముందే ట్రైల‌ర్ రిలీజ్ చేసుకున్న ఆది పిని శెట్టి 'డ్రైవ్' సినిమా చ‌ప్పుడు లేకుండా 12వ తేదీనే రిలీజ్ అవుతుండ‌డం విశేషం. అంటే... ఆది పినిశెట్టి హీరోగా నటించిన 'డ్రైవ్', విలన్ గా నటించిన 'అఖండ 2 తాండవం' రెండూ ఒకే రోజు వస్తున్నాయన్నమాట.

ఓ పెద్ద సినిమా వస్తోందంటే చిన్న చిత్రాలు పక్కకు తప్పుకోవడం పరిపాటే. ఎందుకంటే థియేటర్ల సమస్య తలెత్తుతుంది. అందువల్ల పెద్ద సినిమా రిలీజైన వారం తరువాత ఎటూ థియేటర్లు దొరుకుతాయి కాబట్టి నింపాదిగా రావచ్చని కొందరు భావిస్తారు. అయితే ఈ సారి డిసెంబర్ 19వ తేదీన 'అవతార్ -3' ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. దాంతో చిన్న సినిమాలు మరింత వెనక్కి జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు కొందరు చిన్న చిత్రాల నిర్మాతలు ధైర్యం చేసి బిగ్ మూవీస్ తో పాటే తమ సినిమాలను రిలీజ్ చేస్తూంటారు.

ఎందుకంటే పెద్ద సినిమాల ఓవర్ ఫ్లో తమ చిత్రాలకు కలసి వస్తుందని ఆశిస్తారు. అలా బిగ్ మూవీస్ తో పాటు రిలీజై మంచి వసూళ్ళు చూసిన సినిమాలూ ఉన్నాయి. అందుకేనేమో 'అఖండ-2' రిలీజ్ అయిన మరుసటి రోజునే తమ సినిమా ‘మోగ్లీ’ని రిలీజ్ చేయబోతున్నారు దర్శకనిర్మాతలు. మరి 'అఖండ-2' తో పాటు రాబోయే సినిమాల్లో ఏ యే చిత్రాలు ఆదరణ పొందుతాయో చూడాలి.

Updated Date - Dec 11 , 2025 | 01:09 PM