Miss Terious: అఖండ 2 దెబ్బ... మిస్టీరియస్ కూడా వాయిదా...
ABN , Publish Date - Dec 11 , 2025 | 10:18 PM
'అఖండ 2' కారణంగా వాయిదా పడిన చిత్రాల జాబితాలో మరొకటి చేరింది. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మిస్ స్టీరియస్' మూవీ సైతం విడుదలకు నోచుకోవడం లేదు.
'అఖండ 2 తాండవం' (Akhanda -2 Thandavam) శుక్రవారం గ్రాండ్ గా జనం ముందుకు వస్తోంది. చిత్రం ఏమంటే... డిసెంబర్ 12న రావాల్సిన చాలా సినిమాలు రకరకాల కారణాలతో వాయిదా పడిపోయాయి. 'అన్నగారు వస్తారు, లాక్ డౌన్' వంటి డబ్బింగ్ సినిమాలు పైనాన్స్ ఇష్యూ వల్ల వాయిదా పడగా, 'ఈషా, సైక్ సిద్ధార్థ, సః కుటుంబానాం' సినిమాలు 'అఖండ -2'తో పోటీ పడలేక వేరే డేట్స్ కు వెళ్ళాయి. 'మోగ్లీ' (Mowgli) మూవీ సైతం ఒకరోజు వెనక్కి వెళ్ళింది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు కారణాలు ఏవైనా విడుదల కాకుండా పోస్ట్ పోన్ అయిపోయాయి. అందులో 'మిస్ స్టీరియస్' (Miss Terious) కూడా ఒకటి. డిసెంబర్ 10న ఈ సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్ జరగ్గా బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 'బిగ్ బాస్' ఫేమ్ రోహిత్ సాహ్ని హీరోగా నటించిన ఈ సినిమాలో అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘన రాజ్ పుత్, కన్నడ నటుడు బాలరాజ్ వాడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహి కోమిటి రెడ్డి దర్శకతవ్వంలో ఈ సినిమాను జయ్ వల్లందాస్ నిర్మించారు. అయితే ఇప్పుడు చివరి నిమిషంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్.
'మిస్టీరియస్' మూవీని రెండు తెలుగు రాష్ట్రాలలో 150 థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేద్దామనుకున్నామని, కానీ 'అఖండ 2' సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తుండటంతో తమకు అనుకున్న విధంగా కావాల్సిన థియేటర్లు దొరకడం లేదని, అందుకే మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నామని తెలిపారు. సో... 'అఖండ 2' దెబ్బ పడిన చిన్న సినిమా నిర్మాతల జాబితాలో 'మిస్ స్టీరియస్' మేకర్స్ కూడా చేరిపోయారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.