Ajay Devgn: హైదరాబాద్‌లో.. అజయ్ ‘దేవగన్ సినీ-ఎక్స్’ భారీ మల్టీప్లెక్స్

ABN , Publish Date - Dec 15 , 2025 | 09:54 PM

బాహుబ‌లితో.. తెలుగు సినిమా ఖ్యాతి విశ్వ వ్యాప్తం కాగా దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టి టాలీవుడ్‌పై ప‌డింది.

Ajay Devgn

బాహుబ‌లితో.. తెలుగు సినిమా ఖ్యాతి విశ్వ వ్యాప్తం కాగా దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టి టాలీవుడ్‌పై ప‌డింది. దాంతో సినిమాల‌కు కేరాఫ్ అడ్రస్‌గా రెండు తెలుగు రాష్ట్రాలు నిలుస్తున్నాయి. ఈ క్ర‌మంలో హాలీవుడ్ ఇప్ప‌టికే మ‌న దేశంలో ప్ర‌త్యేక దృష్టి సారించి త‌మ బిజినెస్ అంత‌కంత‌కూ పెంచుకుంటూ వెళుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బాలీవుడ్‌, టాలీవుడ్ స్టార్స్ సైతం తాము ఓ వైపు సినిమాలు చేస్తూనే బిజినెస్‌లో రాణిస్తూ స‌త్తా చాటుతున్నారు.

ఇందులో భాగంగా ఇప్ప‌టికే తెలుగు నాట మ‌హేశ్‌ బాబు, అల్లు అర్జున్‌, ర‌వితేజలు మ‌ల్టీఫ్లెక్స్‌ల బాట ప‌ట్టి విజ‌య‌వంతంగా రాణిస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో రోజురోజుకు మ‌ల్టీఫ్లెక్సుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతూ వ‌స్తోంది. తాజాగా ఈ కోవ‌లో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ (Ajay Devgn) సైతం చేర‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఆయ‌న ప‌లుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌రంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ కోవ‌లోనే ఆయ‌న స్టూడియో కంటే ముందుగా మల్టీప్లెక్స్ బిజినెస్‌పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్ప‌టికే గుర్‌గావ్‌లో ‘దేవగన్ సినీ-ఎక్స్’ పేరుతో ప్రారంభమై మంచి రెస్పాన్స్‌తో విజయవంతంగా నడుస్తోంది.దీంతో అజయ్ దేవగన్ దేశవ్యాప్తంగా ‘దేవగన్ సినీ-ఎక్స్’ (Devgn Cine-X) పేరుతో మల్టీప్లెక్స్ స్క్రీన్‌లను ప్రారంభించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలి దశలో ప్రధాన నగరాల్లో థియేటర్‌లను ఏర్పాటు చేసి, దశలవారీగా సుమారు 250 స్క్రీన్‌లు ప్రారంభించాలన్నది ఆయన లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు స‌మాచారం.

అయితే.. ఇంతకుముందు అజయ్ దేవగన్ – కాజోల్ దంపతులు తమ పిల్లల పేర్లతో ‘ఎన్-వై సినిమాస్’ అనే బ్రాండ్‌తో థియేటర్ వ్యాపారం నిర్వహించారు. కాగా ఇప్పుడు త‌న స్టార్ ఇమేజ్, బ్రాండ్ విలువను మరింత బలపరిచే ఉద్దేశంతో త‌న‌ ‘దేవగన్’ పేరును తెర‌పైకి తీసుకు వ‌చ్చి పెట్టుబ‌డిగా మార్చిన‌ట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో దేవగన్ సినీ-ఎక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ఎల్బీ న‌గ‌ర్ స‌మీపంలోని కర్మన్‌ఘాట్ కొలీజియం మాల్‌లో 7 స్క్రీన్‌లతో కూడిన లగ్జరీ మల్టీప్లెక్స్‌ను వచ్చే ఏడాది ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అయితే.. ఇటీవ‌లే ఈ మాల్‌కు స‌మీపంలోనే ర‌వితేజ ఏఆర్టీ మ‌ల్టీఫ్లెక్స్ ప్రారంభించడం విశేషం. దీంతో పాటు ఎల్బీ న‌గ‌ర్ రింగ్ రోడ్ సెంట‌ర్‌లో కొన్ని సంవ‌త్స‌రాలుగా నిర్మాణంలో ఉన్న మాల్ సైతం వ‌చ్చే ఏడాది అందుబాటులోకి రానుండ‌డం గ‌మ‌నార్హం. చూడాలి ‘దేవగన్ సినీ-ఎక్స్’ బ్రాండ్ హైదరాబాద్‌లో ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో.

Updated Date - Dec 15 , 2025 | 09:54 PM