Mahesh Babu: మ‌రోసారి.. మహేశ్‌ బాబుకు లీగ‌ల్ నోటీసులు

ABN , Publish Date - Jul 07 , 2025 | 07:57 AM

రియల్‌ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేశ్‌బాబుకు తాజాగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

Mahesh Babu

ఓ రియల్‌ ఎస్టేట్ సంస్థ సాయిసూర్య డెవలపర్స్ (Sai Surya Developers)కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీనటుడు మహేశ్‌బాబుకు (Mahesh Babu) తాజాగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. సదరు సంస్థ నిర్వాహకులు లేఔట్‌లో అన్ని అనుమతులున్నాయని ప్రచారం చేసుకున్నారని, మహేశ్ బాబు ఫొటో ఉన్న బ్రోచర్‌లోని వెంచర్‌లో ఉన్న ప్రత్యేకతలకు ఆకర్షితులమై ప్లాటు కొనుగోలు చేశామని ఓ వైద్యురాలితోపాటు మరో వ్యక్తి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్వాహకుల మాటలు నమ్మి బాలాపూర్‌ గ్రామంలో చెరొక ప్లాటు కొనుగోలుకు రూ.34.80 లక్షల చొప్పున చెల్లించామన్నారు.ఆ తర్వాత అసలు లేఔట్‌ కూడా లేదని తెలుసుకొని తమ డబ్బు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడంతో సంస్థ ఎండీ సతీష్‌ చంద్రగుప్తా పలు వాయిదాల్లో చెరి రూ.15 లక్షలు మాత్రమే చెల్లించారని బాధితులు పేర్కొన్నారు.

మహేశ్‌బాబు ఫొటో ఉన్న బ్రోచర్‌ను చూపుతూ లేని వెంచర్‌లో ప్లాట్లను విక్రయించి సాయిసూర్య డెవలపర్స్ (Sai Surya Developers) తమను మోసం చేసిందని, వారిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మెస్సర్స్‌ సాయి సూర్య డెవలపర్స్‌ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్‌ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త సినీనటుడు మహేశ్‌బాబును మూడో ప్రతివాదులుగా పేర్కొన్న ఫోరం వారికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారు సోమవారం వ్యక్తిగతంగా గానీ న్యాయవాదుల ద్వారా గానీ హాజరు కావాల్సి ఉంది.

ఇదిలాఉంటే.. సాయి సూర్య డెవలపర్స్‌ ప్రకటనల్లో నటించినందుకు మహేశ్‌ బాబుకు రూ.5.9 కోట్లు పారితోషికం చెల్లించారు. అందులో రూ.2.5 కోట్లు నగదు రూపంలో ఇచ్చారు. ఈ మ‌ధ్య‌జరిగిన ఈడీ సోదాల్లో ఈ విషయం వెల్లడికావడంతో మహేశ్‌బాబును విచారణకు రావాలని ఈడీ నోటీసు జారీ చేయ‌గా షూటింగ్‌లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనని సినీ హీరో మహేశ్‌బాబు ఈడీ అధికారులకు లేఖ పంపారు. దీంతో ఇప్పుడు మ‌రోసారి మ‌హేశ్‌కు నోటీసులు ఇచ్చారు.

Updated Date - Jul 07 , 2025 | 07:57 AM