Shilpa Shirodkar: నాడు మోహన్ బాబు ‘బ్రహ్మ’.. నేడు సుధీర్ బాబు ‘జటాధర’
ABN , Publish Date - Oct 28 , 2025 | 08:55 AM
‘బ్రహ్మ’ సినిమా తర్వాత ‘జటాధర’తో తెలుగు చిత్రపరిశ్రమలోకి తిరిగి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని సినిమాలో కీలకమైన పాత్ర అని చెప్పారు శిల్పా శిరోద్కర్.
‘బ్రహ్మ’ సినిమా తర్వాత ‘జటాధర’(Jatadhara) తో తెలుగు చిత్రపరిశ్రమలోకి తిరిగి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో డబ్బుపై అత్యాశ ఉండే శోభ అనే మహిళ పాత్రలో నటించాను. ఎలాగైనా సరే ధనవంతురాలిని అవ్వాలనే క్యారెక్టర్ ఇది. అంతేకాదు సినిమాలో నాది కీలకమైన పాత్ర కూడా’ అని చెప్పారు శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar). సుధీర్ బాబు (Sudheer Babu), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రధారులుగా దర్శకద్వయం వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించిన చిత్రమిది.
ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంస్థలు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేశ్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. నవంబరు 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శిల్పా శిరోద్కర్ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

సుధీర్ బాబుతో కలసి పనిచేయడం గొప్ప అనుభవం. ఆయన ఎంతో అంకితభావంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. నేటి తరం నటుల నుంచి చాలా నేర్చుకోవచ్చు. సుధీర్ బాబు మాకు బంధువే అయినప్పటికీ సెట్‌లో మేమిద్దరం ప్రొఫెషనల్‌గానే ఉండేవాళ్లం. మహేశ్ బాబుగారు ఈ చిత్రం ట్రైలర్‌ని ఆవిష్కరించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన పరిశ్రమలోకి నన్ను ఆహ్వానించడం చెప్పలేనంత సంతోషం కలిగించింది.
గతంతో పోల్చితే, తెలుగు చిత్ర పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. కంటెంట్ పరంగా, టెక్నికల్ పరంగా చాలా అడ్వాన్స్ అయ్యాము. ‘జటాధర’ ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఇందులో అద్భుతమైన సన్నివేశాలు ఉంటాయి. భావోద్వేగాలు కూడా అంతే అద్భుతంగా పండాయి. మంచి సంగీతం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే చిత్రమిది.వెంకట్, అభిషేక్ మంచి క్లారిటీ ఉన్న దర్శకులు. నటీ, నటుల నుంచి ఎం కావాలో వాళ్లకి తెలుసు. నాకు రొమాంటిక్ కామెడీలు అంటే చాలా ఇష్టమని తన మనసులోని భావాలను పంచుకున్నారు.