Sadha: ఇండియాలో.. ఇలాంటి తీర్పా! భోరున విలపించిన సదా
ABN , Publish Date - Aug 13 , 2025 | 07:04 PM
వీధి కుక్కల విషయంలో ఢిల్లీ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఇప్పుడు అంతటా చర్చనాయాంశం అవుతోంది.
తాజాగా సోషల్ మీడియాలో ఓ అంశం తెగ హల్‌చల్ చేస్తోంది. వీధి కుక్కల విషయంలో ఢిల్లీ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అవుతోంది. ఢిల్లీ (Delhi)లో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యపై, కుక్కకాటు ఉదంతాలు, తమ దృష్టికి వచ్చిన ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని సుప్రీం కోర్టు (Supreme Court India) స్పందిస్తూ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌సీఆర్ ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఎక్కడా స్ట్రీట్ డాగ్స్ కనిపించకుండా, వాటిని షెల్టర్లకు తరలించాలని అది కూడా రెండు నెలల్లో పూర్తవ్వాలని స్పష్టం చేసింది. అంతేగాక ఇకపై ఢిల్లీలో ఎక్కడా వీధి కుక్కలు కనపిచడానికి వీల్లేదని, స్ట్రీట్ డాగ్స్ కి అనుకూలంగా సమర్పించే ఎలాంటి దరఖాస్తునూ అనుమతించేది లేదంటూ ధర్మాసనం స్పష్టంగా తెలిపింది.
అయితే.. ఇప్పుడు ఈ తీర్పు విషయంలో దేశమంతటా జంతు హక్కుల పరిరక్షకులు, సినీ ప్రముఖుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్, జాన్ అబ్రహం, వరుణ్ ధావన్, రూపాలీ గంగూలీ వంటి పలువురు సినీ సెలబ్రిటీలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ కోవలో తాజాగా నటి సదా (Sadaa) కోర్టు తీర్పుపై దిగ్బ్రాంతి, ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెడుతూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "దేశ రాజధాని ఢిల్లీలో సుమారు 3 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నాయి. వాటన్నంటినీ షెల్టర్లలో ఉంచే సౌకర్యం ఏమాత్రం లేదు. వాటిని చంపేసే పరిస్థితి వస్తుందని, మాస్ కిల్లింగ్స్ జరుగుతాయని భయం వేస్తోంది" అని అన్నారు.
రేబిస్ నియంత్రణ కోసం వ్యాక్సిన్ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమని, ఇప్పటికే యానిమల్ లవర్స్, ఎన్జీవోలు తమవంతు సహాయం చేస్తున్నా, ప్రభుత్వ మద్దతు చాలా తక్కువగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ఇళ్లలో కుక్కలు, పిల్లులు పెంచుకునే ప్రతి ఒక్కరూ ఈ తీర్పు వ్యతిరేకంగా ముందుకు రావాలి. లేని పక్షంలో జంతు ప్రేమికులమనే హక్కు మనకు లేదు" అని సదా స్పష్టం చేశారు. ఇండియా లాంటి దేశంలో ఇలాంటి తీర్పు వస్తుందని ఊహించలేదు. హృదయం ముక్కలైందనే భావన కలిగింది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.స్ట్రీట్ డాగ్స్ విషయంలో ఇటువంటి తీర్పు వచ్చినందుకు మనమంతా సిగ్గుపడాలంటూ బోరున విలపించింది. ప్రస్తుతం సదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.