Shiva Rajkumar: తెలుగు నేర్చుకుంటా.. డబ్బింగ్‌ నేనే చెబుతా

ABN , Publish Date - Dec 07 , 2025 | 05:51 AM

కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ టైటిల్‌ పాత్రలో పేదల పక్షపాతి ఇల్లందు మాజీ శాసన సభ్యుడు గుమ్మడి నర్సయ్య జీవిత కథను అదే పేరుతో సినిమాగా తీస్తున్నారు.

Shiva Rajkumar

పేదల పక్షపాతి, సైకిల్‌ పై అసెంబ్లీకి వెళ్లిన ఇల్లందు మాజీ శాసన సభ్యుడు గుమ్మడి నర్సయ్య (Gummadi Narsaiah) జీవిత కథను అదే పేరుతో సినిమాగా తీస్తున్నారు ఎన్‌.సురేశ్‌రెడ్డి. కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) టైటిల్‌ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శనివారం పాల్వంచలో మొదలైంది.

తెలంగాణ ఉప ముఖ్యమత్రి సతీమణి నందిని దర్శకుడు పరమేశ్వర్‌ హివ్రాలేకు (Parameshwar Hivrale) స్ర్కిప్ట్‌ను అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రధాని నరేంద్రమోదీకి చూపిస్తామని అన్నారు. శివ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘ఒక మంచి వ్యక్తి పాత్రను పోషిస్తున్నందుకు ఆనందంగా, గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటా.. నేనే డబ్బింగ్‌ చెబుతా’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుమ్మడి నర్సయ్య (Gummadi Narsaiah)మాట్లాడుతూ ‘వ్యవస్థలో మార్పు రావాలంటే ముందు మనలో మార్పు రావాలి. నేనేం గొప్ప నాయకుడిని కాదు.. అందరిలా సామాన్యుడినే. నన్ను గొప్పగా కాకుండా నా భావాలను మాత్రమే ఈ సినిమాలో చూపించాలని, చూపిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.

ఉద్యమగడ్డ అయిన పాల్వంచ నుంచి ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టామనీ, ‘గుమ్మడి నర్సయ్య’ చిత్రం రాజకీయాల్లో కచ్చితంగా మార్పు తెస్తుందని భావిస్తున్నామనీ నిర్మాత సురేశ్‌రెడ్డి చెప్పారు.

Updated Date - Dec 07 , 2025 | 05:51 AM