Sai Durga Tej: పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడాలి.. సోషల్ ఐడీలు ఆధార్‌కు లింక్ చేయాలి
ABN , Publish Date - Sep 14 , 2025 | 09:42 AM
పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు ముందుండాలని పిలుపునిచ్చారు సాయి దుర్గ తేజ్.
పిల్లలపై లైంగిక దాడిని నిర్మూలించడానికి, పిల్లలకు సరైన అవగాహన ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), యంగ్ ఇండియన్స్ (YI) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ (abhayam masoom summit) కార్యక్రమం విజయవంతంగా జరిగింది. భారత్ రైజింగ్, YI, CII సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej), మంత్రి సీతక్క, YI కో చైర్మన్ భవిన్ పాండ్య, నేషనల్ చైర్మన్ తరంగ్ ఖురానా, CII తెలంగాణ ఛైర్మన్ శివ ప్రసాద్ రెడ్డి, జోత్స్న సింగ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ, పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు ముందుండాలని పిలుపునిచ్చారు. “మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. సోషల్ మీడియాలో పిల్లలపై జరుగుతున్న అబ్యూజ్ నాకు చాలా బాధ కలిగిస్తుంది. అలాంటి కామెంట్లను లైక్ చేయడం, నవ్వడం ఎంతవరకు సరైనది? మన సమాజాన్ని ఇలా కావాలని కోరుకుంటున్నామా?” అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపాలని సూచించారు. “సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నా లవ్ స్టోరీని నా అమ్మతో పంచుకున్నాను. అలాంటి స్వేచ్ఛ పిల్లలకు ఇవ్వాలి. మంచి తాకిడి, చెడు తాకిడిపై స్కూల్లో టీచర్లు, ఇంట్లో పేరెంట్లు అవగాహన కల్పించాలి” అని అన్నారు.
సోషల్ మీడియా వల్ల పిల్లలు ప్రభావితం కాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. “సోషల్ మీడియా ఐడీలను తల్లిదండ్రుల నంబర్లకు లేదా ఆధార్ కార్డ్‌కు లింక్ చేయడం వంటి చర్యలు చేపట్టాలి. కనీసం వారానికి ఒకసారి అయినా కుటుంబంతో కలిసి సమయం గడపాలి” అని సూచించారు. అదనంగా, తాను వ్యక్తిగతంగా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, అరకులో స్కూల్ నిర్మాణానికి తోడ్పడ్డానని తెలిపారు. “గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు అవగాహన ఇవ్వడం ఎంతో అవసరం. నా సినిమాల్లో కూడా టీజింగ్ సాంగ్‌లను నిలిపేశాను. ప్రేమిస్తే పొగడాలి కానీ హింసించకూడదు” అని అన్నారు. చివరిగా ఆయన సరదాగా మాట్లాడుతూ, “నా పెళ్లి గురించి ఊహాగానాలు ప్రచారం చేయకండి, నేనే స్వయంగా ప్రకటిస్తాను” అని నవ్వుతూ చెప్పారు.
సోషల్ మీడియా యుగంలో పిల్లల భద్రతపై అవగాహన పెంచడం అత్యవసరం. పిల్లలతో ప్రేమగా మాట్లాడటం, సరైన సమాచారం అందించడం ద్వారా వారి జీవితాన్ని రక్షించవచ్చని సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ ఈ కార్యక్రమంలో స్పష్టంగా తెలియజేశారు. ఇది ప్రతి తల్లిదండ్రికి, ఉపాధ్యాయుడికి, సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది.