Kota Srinivasarao: మలుపు తిప్పిన ప్రాణం ఖరీదు

ABN , Publish Date - Jul 13 , 2025 | 06:50 AM

రెండు దశాబ్దాల పాటు నాటక రంగానికి విశేష సేవ చేసిన కోట శ్రీనివాసరావు ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగు సినిమాలలో వైవిధ్యమై పాత్రలను పోషించి, తనదైన ముద్రను వేశారు. ఏకంగా తొమ్మిది నంది అవార్డులను అందుకున్నారు. కోట శ్రీనివాసరావు నట ప్రస్థానం సాగిన వైనం ఇది.

కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) స్వస్థలం కృష్ణాజిల్లాలోని కంకిపాడు. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్థ వైద్యులు. 1945 జులై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. ప్రాధమిక విద్యను కంకిపాడులో చేసిన కోట విజయవాడలో డిగ్రీ చదివారు.

తన పదమూడవ ఏట నుండే కోట నాటకాలు ప్రదర్శించడం మొదలు పెట్టారు. పినిశెట్టి శ్రీరామమూర్తి (దర్శకుడు రవిరాజా పినిశెట్టి తండ్రి) రాసిన 'ఆడది' (Adadi) నాటికం కోటకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (SBI)లో ఉద్యోగంలో చేరారు. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే కోట నాటకాలు వేస్తూ ఉండేవారు. సి.ఎస్. రావు రాసిన 'ప్రాణం ఖరీదు' (Pranam Kharidu) నాటకం ఆయనను సినిమాల్లోకి వెళ్ళేలా చేసింది. ప్రముఖ దర్శక నిర్మాత క్రాంతి కుమార్ (Kranthi Kumar) ఒకసారి 'ప్రాణం ఖరీదు' నాటకం చూసి దానిని సినిమాగా తీయాలని ఆయన అనుకున్నారు. ఆ చిత్రానికి కథ, మాటలు రాసే అవకాశం సీ.ఎస్. రావుకే ఇచ్చారు. అలా కోట శ్రీనివాసరావుకూ అందులో నటించే అవకాశం వచ్చింది. చిరంజీవి, చంద్రమోహన్, నూతన ప్రసాద్ తదితరులు నటించిన 'ప్రాణం ఖరీదు'కు వాసు దర్శకత్వం వహించారు. ఇది 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. అలా కోట సినీ ప్రస్థానం మొదలైంది.


మలుపుతిప్పిన 'ప్రతిఘటన'

కోటకు నటుడిగా పూర్తి స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా 'ప్రతిఘటన' (Prathighatana). టి. కృష్ణ (T Krishna) దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ఈ సినిమా 1985లో విడుదలై విజయఢంకా మోగించింది. ఇందులో కోట శ్రీనివాసరావు పోషించిన పాత్ర వెండితెరపై అద్భుతంగా పేలింది. ఇక అక్కడ నుండి కోట వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. అలానే 1987లో జంద్యాల దర్శకత్వంలో రామానాయుడు (Ramanaidu) నిర్మించిన 'ఆహనా పెళ్ళంట' సినిమా కోటలోని మరో యాంగిల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కామెడీ సైతం కోట అద్భుతంగా పోషించగలరని తెలిసింది.

నాటకరంగంలో ఉన్న అనుభవం కారణంగా కోట వైవిధ్యమైన పాత్రలను అవలీలగా చేయగలిగారు. వెండితెరపై ఎన్టీయార్ (NTR) ను ఇమిటేట్ చేస్తూ ఆయన చేసిన 'మండలాధీశుడు' కూడా బాగా ఆడింది. అప్పట్లో ఆ సినిమా ఆయన్ని పలు ఇబ్బందులకూ గురిచేసింది. అయితే... ఎన్టీఆర్ పెద్ద మనసు కారణంగా తిరిగి కోట శ్రీనివాసరావు నిలదొక్కుకుని చిత్రసీమలో కొనసాగారు.

ఎన్టీఆర్ ను అనుకరిస్తూ సినిమాల్లో కొన్ని పాత్రలు చేసినా... తనకు రామారావు అన్నా, నాగేశ్వరరావు అన్న ఇష్టమని కోట చెప్పేవారు. అలానే ఎస్వీఆర్, గుమ్మడి, లింగమూర్తి, ముక్కామల, సి.యస్.ఆర్. ఆంజనేయులు, ధూళిపాళ, వంగర, అల్లు రామలింగయ్య అంటే ఇష్టమని చెబుతూ ఉండేవారు.

కోటలోని నటనా వైదుష్యానికి అబ్బురపడిన దర్శకులు ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయించుకునే వారు. జంద్యాల, వంశీ, ఇవీవీ సత్యనారాయణ, రామ్ గోపాల్ వర్మ, కోడి రామకృష్ణ తదితరులంతా కోటను తమ చిత్రాలలో బాగా ఉపయోగించుకున్నారు.

తెలుగు సినిమా రంగంలో పరభాషా నటుల డామినేషన్ ను కోట శ్రీనివాసరావు సహించే వారు కాదు. అభినయమే కాదు భాష మీద కూడా పట్టులేని వారిని తీసుకొచ్చి అందలం ఎక్కించడాన్ని ఆయన సహించలేకపోయే వారు. పలు సందర్భాలలో తన అసంతృప్తిని బాహాటంగానూ వ్యక్తం చేశారు కోట శ్రీనివాసరావు.

ప్రజాసేవలోనూ...

కోట శ్రీనివాసరావు నాటక, సినీ రంగాలకే పరిమితం కాలేదు. ప్రజా సేవలోనూ నిమగ్నమయ్యారు. 1999- 2004లో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుండి బీజేపీ తరఫున శాసనసభ్యుడిగా సేవలు అందించారు. ఐదు దశాబ్దాల సినీ జీవితంలో దాదాపు వెయ్యి చిత్రాలలో నటించిన కోట శ్రీనివాసరావును పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అయితే తన అడుగు జాడలలో సాగుతూ చిత్రసీమలోకి నటుడిగా అడుగు పెట్టిన కుమారుడి దుర్మరణంతో కోట కొంత కృంగిపోయారు. ఆ తర్వాత నిదానంగా కోలుకుని సినిమాల్లో నటిస్తూ వచ్చారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు భార్య రుక్మిణి, ఆడపిల్లలు అవని, పల్లవి ఉన్నారు. కోట శ్రీనివాసరావు తమ్ముడు శంకరరావు కూడా నటుడే.

కోట శ్రీనివాసరావు మరణంతో తెలుగు చిత్రసీమ ఓ గొప్ప గుణచిత్ర నటుడిని కోల్పోయినట్టు అయ్యింది.

Updated Date - Jul 13 , 2025 | 07:31 AM