Bandi Saroj: బాధ్యత ఉండక్కర్లా.. అఖండ 2 మేకర్స్ పై నటుడు ఫైర్
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:37 PM
పెద్ద సినిమాలు సడెన్ గా వాయిదా పడ్డాయి అంటే చిన్న సినిమాల నిర్మాతల గుండెల్లో రాయి పడినట్లు అవుతుంది.
Bandi Saroj: పెద్ద సినిమాలు సడెన్ గా వాయిదా పడ్డాయి అంటే చిన్న సినిమాల నిర్మాతల గుండెల్లో రాయి పడినట్లు అవుతుంది. ఎక్కడ తమ సినిమా రిలీజ్ డేట్ కు పెద్ద సినిమాలు వస్తాయేమో అని భయంతో బతుకుతూ ఉంటారు. ప్రస్తుతం మోగ్లీ (Mowgli) సినిమా పరిస్థితి అలానే ఉంది. సుమ కొడుకు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మోగ్లీ. నటుడు, దర్శకుడు అయిన బండి సరోజ్ (Bandi Saroj) ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మొదటి నుంచి మోగ్లీ డిసెంబర్ 12 న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటిస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. అయితే డిసెంబర్ 5 న రిలీజ్ కావాల్సిన అఖండ 2 వాయిదా పడిన విషయం తెల్సిందే. ప్రస్తుతం అఖండ 2 రిలీజ్ డేట్ పైనే ఇండస్ట్రీలో సందిగ్దత నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 12 నే అఖండ 2 ని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ రోజు కనుక బాలయ్య దిగితే.. చిన్న సినిమాల గతి అధోగతి అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మోగ్లీ కాకుండా అదే రోజున కార్తీ అన్నగారు వస్తారు. నందు సైక్ సిద్దార్థ్, ఈషా లాంటి చిన్న చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ప్రస్తుతం ఈ చిన్న సినిమాలు అన్ని ప్రమోషన్స్ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. అఖండ 2 డిసెంబర్ 12 న వస్తే.. వీరందరూ తమ సినిమాలను వాయిదా వేసుకుంటారు. కానీ, ఇంకా అఖండ 2 రిలీజ్ డేట్ ఫైనల్ కాదు. దీనిపై నటుడు బండి సరోజ్ మండిపడ్డాడు. 14 రీల్స్ కి బాధ్యత లేదని ఫైర్ అయ్యాడు. రిలీజ్ డేట్ చెప్తే ప్రమోషన్స్ ఆపుకుంటామని, అఖండ 2మేకర్స్ ఎవరికి నిద్ర పట్టకుండా చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.
'అస్సలు బాధ్యత లేని సంస్థ 14 రీల్స్ ప్లస్.. ఏదోకటి కన్ఫర్మ్ చేస్తే, 12కి రిలీజ్ అవ్వాల్సిన సినిమాల పబ్లిసిటీ ఖర్చులు మిగులుతాయి కదా. ఏ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా అటు అభిమానుల్ని, ఇటు సినిమా ఇండస్ట్రీ నీ, మరో పక్క డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నీ అందరికీ నిద్రలు లేకుండా చేసి ఏం సాధిస్తున్నారు. చెడ్డ పేరు తప్ప. బాధ్యత ఉండాలిగా .. అఖండ 2 రిలీజ్ డేట్ ఎప్పుడు' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కొద్దిగా హర్ష గా మాట్లాడిన సరోజ్ అడిగిన దాంట్లో తప్పు లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.