Mayasabha Teaser: యుద్ధం నీ ధర్మం.. ఆసక్తిరేపుతున్న మయసభ ట్రైలర్
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:32 PM
ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో పొలిటికల్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీల మధ్య వైరం, సీనియర్ ఎన్టీఆర్ (NTR) సినీ జీవితం, రాజకీయ జీవితం, వైఎస్సార్ (YSR) జీవితం, జగన్ జీవితం.. ఇలా ఎంతోమంది ప్రముఖుల జీవితాలను చాలామంది దర్శకులు ప్రేక్షకులకు చూపించారు.
Mayasabha Trailer: ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో పొలిటికల్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీల మధ్య వైరం, సీనియర్ ఎన్టీఆర్ (NTR) సినీ జీవితం, రాజకీయ జీవితం, వైఎస్సార్ (YSR) జీవితం, జగన్ జీవితం.. ఇలా ఎంతోమంది ప్రముఖుల జీవితాలను చాలామంది దర్శకులు ప్రేక్షకులకు చూపించారు. ఇప్పుడు మరోసారి.. మరో డైరెక్టర్ ఇంకో ఒరిజినల్ కథతో రాబోతున్నాడు. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మధ్య ఉన్న విభేదాల గురించే అందరికీ తెలుసు. కానీ, వారు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఇప్పుడు ఆ ఇద్దరు రాజకీయ నేతల స్నేహం ఎలాంటిదో డైరెక్టర్ దేవా కట్టా (Deva Katta) ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.
ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మయసభ. సోనీ లివ్ ఒరిజినల్ గా తెరకెక్కిన ఈ సినిమాను విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీ హర్ష నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేసి ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 7 న స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు గొప్ప స్నేహితుల కథ, రాష్ట్ర కథగా మారింది అనే లైన్ తో టీజర్ మొదలయ్యింది.
చంద్రబాబు నాయుడుగా ఆది పినిశెట్టి కనిపించగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా చైతన్యరావు కనిపించాడు. ' అన్నా .. అర్జెంట్ గా బయల్దేరి ఆశ్రమ్ హోటల్ కు వచ్చేయ్. పెద్దాయన రేపు పార్టీలో సస్పెండ్ చేసే 35 ఎమ్మెల్యేలలో నువ్వు కూడా ఉన్నావ్ ' అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమయ్యింది. ఆ సంఘటన జరుగుతున్న సమయంలో నాయుడు- రెడ్డిల మధ్య జరిగిన ఫోన్ సంభాషణను ఎంతో రియలిస్టిక్ గా చూపించారు. ప్రతిపక్ష నాయకుడుకు ఫోన్ చేసి అధికార పార్టీ నాయకుడు సలహా అడగడం, వెన్నుపోటు పొడుస్తాను అని నాయుడు చెప్పడం.. అది యుద్ధం కాదు ధర్మం అని రెడ్డి సలహా ఇవ్వడం.. ఇలా ప్రతి డైలాగ్ హైలైట్ గా నిలిచాయి.
నాయుడు- రెడ్డిల మధ్య స్నేహం.. ఒక రాష్టాన్ని ఎలా మార్చేసింది అనేది ఈ సినిమా కథగా చెప్పుకొచ్చారు. టీజర్ మొత్తానికి హైలైట్ డైలాగ్ అంటే.. '20 ఏళ్ల రాజకీయ జీవితం.. ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుంది అనుకోలేదు' అని నాయుడు.. రెడ్డికి చెప్పడం. టీడీపీ అధినేతను ఉద్దేశించే నాయుడు ఆ డైలాగ్ చెప్పినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక చివర్లో నాయుడు - రెడ్డిల కులాల గురించి ప్రస్తావన మారినంత హీట్ ను పెంచింది. ప్రస్తుతం ఈ టీజర్ రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కిస్తోంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. టీజర్ తోనే ఇంత హైప్ తీసుకొచ్చిన దేవా కట్టా ఈ సినిమాతో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాడో చూడాలి.