Aadhi Pinisetty: పదివేల వాట్స్ కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుంది
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:03 PM
కథ వినకుండా ఓకే చేసిన మొదటి చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2). బోయపాటి (Boyapati Srinu) మీద నాకు చాలా నమ్మకం. ఆయన సత్తా ఏంటో నాకు తెలుసు.
'కథ వినకుండా ఓకే చేసిన మొదటి చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2). బోయపాటి (Boyapati Srinu) మీద నాకు చాలా నమ్మకం. ఆయన సత్తా ఏంటో నాకు తెలుసు. బాలయ్య గారికి ఎదురుగా సరిపోతానా? అని అడిగాను. పర్‌ఫెక్ట్‌గా ఉంటారు అని ఆయన అన్నారు. సెట్‌కి వెళ్లిన తరువాతే కథ తెలిసింది' అని ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) అన్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ మూవీని డిసెంబర్ 5న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ఆది పినిశెట్టి మీడియాతో ముచ్చటించారు.
చాలా కన్ఫ్యూజ్ అయ్యాను
‘సరైనోడు’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న రెండో సినిమా ఇది. అందులోని పాత్రకి ‘అఖండ 2’లో నేను పోషించిన కారెక్టర్‌కు చాలా తేడా ఉంటుంది. ఇలాంటి పాత్రను పోషించడం నాకు కూడా కొత్తే. ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా? అని నేను కూడా ఎదురుచూస్తున్నాను. మంత్రతంత్రాల చుట్టూ తిరిగే పాత్రలు నేను ఇప్పటిదాకా చేయలేదు. కథ వినకుండా ఓకే చేసిన మొదటి చిత్రం ‘అఖండ 2’. బోయపాటి మీద నాకు చాలా నమ్మకం. ఆయన సత్తా ఏంటో నాకు తెలుసు. బాలయ్య గారికి ఎదురుగా సరిపోతానా? విలన్‌గా చేయాల అంటే భయపడి అడిగాను. పర్‌ఫెక్ట్‌గా ఉంటారు అని ఆయన అన్నారు. సెట్‌కి వెళ్లిన తరువాతే కథ తెలిసింది. నా పాత్రను వివరించిన తరువాత చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. వైరం ధనుష్ లాంటి పాత్రలు అయితే సొంతంగా ఊహించుకుని చేసుకోవచ్చు. కానీ ఇందులో పోషించిన పాత్ర మాత్రం నాకు ఓ ప్రయోగం లాంటిదే. ఇందులోని ప్రతీ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆడియెన్స్ ఎలా రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. ఈ పాత్రకు సంబంధించి ముందే కొన్ని రిఫరెన్స్‌లు ఇచ్చారు. ఇలానే ఉండాలి.. ఇలానే కనిపించాలి.. ఇలానే ప్రవర్తించాలి అని ఆయన ముందే చెప్పారు. చాలా లుక్ టెస్ట్‌ల తరువాత ఫైనల్‌గా ఇప్పుడు సినిమాలో మీరు చూస్తున్న లుక్ ఫైనల్ అయింది.
సినిమా అంటే పిచ్చి ఆయనకి..
బాలయ్య గారి గురించి బయట చాలా వింటుంటాం. కానీ సెట్‌లో ఆయన ఎనర్జీ వేరేలా ఉంటుంది. ఆయన ఉంటే సెట్‌లో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. మా నాన్న గారితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌ని కూడా నాతో పంచుకున్నారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ‘అఖండ’ కంటే ‘అఖండ తాండవం’లో హై మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బాలయ్య యాక్షన్, బోయపాటి మేకింగ్, తమన్ మ్యూజిక్, ఎలివేషన్స్‌ని చూస్తే పదివేల వాట్స్ కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుంది. వావ్ అనిపించేలా, ఆశ్చర్యపోయేలా ఎన్నో అంశాల్ని చూపించబోతోన్నారు. అదే ‘అఖండ 2’ ప్లస్ పాయింట్. ‘అఖండ తాండవం’లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. మరీ ముఖ్యంగా రెండు మేజర్ సీక్వెన్స్‌లు ఉంటాయి. ఓ సీక్వెన్స్‌ను ఎండాకాలంలో 15 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేశాం. మద్యాహ్నం వరకు చాలా మంది ఎండదెబ్బకు పడిపోయారు. కానీ బాలయ్య మాత్రం ఆ ఎండలోనే అలా నిల్చుండేవారు. కనీసం గొడుగు కూడా పట్టుకుని ఉండేవారు కాదు. సినిమా పట్ల ఆయనకు ఉండే ప్రేమ, పిచ్చి నాకు అప్పుడు అర్థమైంది.
ఎన్నో డిఫరెంట్ లొకేషన్స్‌లో ఇంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించడం మామూలు విషయం కాదు. 14 రీల్స్ మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ మూవీని గొప్పగా నిర్మించింది. ఎవ్వరికీ ఎప్పుడు కూడా పేమెంట్స్ విషయంలో ఆలస్యం చేయలేదు. ఇలాంటి ప్రొడక్షన్ కంపెనీ, రామ్ ఆచంట, గోపీ ఆచంట వంటి నిర్మాతలతో మళ్లీ మళ్లీ పని చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ‘థండర్’ అనే స్పోర్ట్స్ డ్రామాని తమిళ, తెలుగు భాషల్లో చేస్తున్నాను. ‘మరకతమణి’ సీక్వెల్ చేస్తున్నాను. కార్తీతో కలిసి ‘మార్షల్’ మూవీని కూడా చేస్తున్నాను.