Vrushchikam: స్వీయ దర్శకత్వంలో హీరోగా...
ABN , Publish Date - May 08 , 2025 | 05:06 PM
నటుడు మంగపుత్ర ఇప్పుడు హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో 'వృశ్చికం' పేరుతో సినిమా చేస్తున్నాడు. శివరామ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గురువారం మొదలైంది.
మంగపుత్ర (Mangaputra), యశ్విక (Yashvika) జంటగా నటిస్తున్న సినిమా 'వృశ్చికం' (Vrushchikam). ఈ చిత్రాన్ని శివరామ్ (Shivram) నిర్మిస్తున్నారు. మంగపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) పాల్గొని గౌరవ దర్శకత్వం వహించారు. నటులు కోసూరి సుబ్రహ్మణ్యం కెమెరా స్విచ్ఛాన్ చేయగా, సుప్రీంకోర్టు అడ్వకేట్ హబీబ్ సుల్తానా క్లాప్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంగపుత్ర మాట్లాడుతూ, ''పదిహేను సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. నటుడిగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గారి ''జల్సా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్'' మూవీస్ తో పాటు ''బాహుబలి 1, 2'' (Bahubali) చిత్రాల్లో నటించాను. రాజమౌళి (Rajamouli) గారిని చూసి, ఆయన దర్శకత్వానికి ఏకలవ్య శిష్యుడిగా మారాను. 'వృశ్చికం' మూవీతో హీరోగా, దర్శకుడిగా మారుతున్నాను. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. మూడు షెడ్యూల్స్ లో 45 రోజుల్లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. రామచంద్రాపురం, భద్రాచలం, హైదరాబాద్ లో షూటింగ్ జరుపుతాం. ఈ సినిమాను మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మీ ముందుకు తీసుకొస్తాం'' అని అన్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం పట్ల యశ్విక సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమాలో తానో ప్రముఖ పాత్ర పోషిస్తున్నానని కోసూరి సుబ్రహ్మణ్యం తెలిపారు. నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలు చేసిన తాను ఈ టీమ్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉందని క్రాంతి బలివాడ తెలిపింది. ఈ సినిమాలో మూడు పాటలున్నాయని, నేపధ్య సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉందని సంగీత దర్శకుడు ప్రమోద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ డైరెక్టర్ సముద్రాల రవిచంద్ర కూడా పాల్గొన్నారు.