A Master Piece: తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు ఎక్కేలా..
ABN , Publish Date - Sep 08 , 2025 | 08:23 PM
శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు పూర్వాజ్ (poorvaj) రూపొందిస్తున్న కొత్త సినిమా 'ఏ మాస్టర్ పీస్'(A Master Piece).
శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు పూర్వాజ్ (poorvaj) రూపొందిస్తున్న కొత్త సినిమా 'ఏ మాస్టర్ పీస్'(A Master Piece). అరవింద్ కృష్ణ (Aravind Krishna), జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.తాజా షెడ్యూలులో క్లైమాక్స్ సీన్స్ రూపొందిస్తున్నారు.
దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ 'అరవింద్ కృష్ణ ఈ చిత్రంలో సూపర్ హీరోగా కనిపిస్తారు. ఈ కథను మన పురాణా ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారు చేశాను. దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది, ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో క్యారెక్టర్ ను, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఒక అంశంతో సూపర్ విలన్ పాత్రను క్రియేట్ చేశాం. శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి అనుసంధానిస్తూ సాగే ఒక కొత్త తరహా స్క్రిప్ట్ ను 'ఏ మాస్టర్ పీస్' చిత్రంలో చూస్తారు. అరవింద్ కృష్ణ సూపర్ హీరోగా మనీష్ గిలాడ సూపర్ విలన్ గా ఆకట్టుకుంటారు. ఈ కథలో శివుడి నేపథ్యం ఉంటుంది కాబట్టి మేము అనుకున్న వర్క్స్ అనుకున్నట్లు జరిగితే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.
అరవింద్ కృష్ణ మాట్లాడుతూ 'అనివార్య కారణాలతో మా సినిమా షూటింగ్ కొంత ఆలస్యమైంది. నాకు కొన్నిసార్లు గాయాలు అయ్యాయి. దాంతో షూటింగ్ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. నాకోసం మా డైరెక్టర్ పూర్వాజ్ గారు చాలా వెయిట్ చేశారు. నాకే కాదు మా టీమ్ లోని చాలా మందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. అవన్నీ గుర్తు వస్తే నేను ఎమోషనల్ అవుతాను. మనం జీవితంలో ఏదో గొప్పగా సాధించబోయో ముందు ఇలాంటి కష్టాలు వస్తుంటాయని అంటారు. ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా రూపొందుతోంది' అన్నారు.
జ్యోతి పూర్వాజ్ మాట్లాడుతూ నేను రెండేళ్ల కిందట ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. ఆ తర్వాత ఈ సినిమా వల్ల పూర్వాజ్ నా లైఫ్ పార్టనర్ గా మారాడు. 'ఏ మాస్టర్ పీస్' సూపర్బ్ స్క్రిప్ట్ తో వస్తోంది. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉంటుంది. ప్రేక్షకులు ఒక్కోసారి ఆశ్చర్యపోతారు. నా కెరీర్ లో నటిగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ ఇది. మైథాలజీని, సూపర్ హీరో జానర్ ను కలిపి ఒక గొప్ప చిత్రాన్ని డైరెక్టర్ పూర్వాజ్ రూపొందిస్తున్నారు. నేను పేర్లు చెప్పను గానీ తెలుగులో వచ్చిన కొన్ని గొప్ప చిత్రాల సరసన చేరుతుంది. సూపర్ హీరోగా మనం ఎలా ఊహించుకుంటామో అలా అరవింద్ కృష్ణ కనిపిస్తారు' అన్నారు.
ప్రొడ్యూసర్ శ్రీకాంత్ కండ్రేగుల మాట్లాడుతూ 'మలయాళంలో మిన్నల్ మురళీ సినిమా వచ్చాక అలాంటి ఒక సూపర్ హీరో చిత్రాన్ని మనం తెలుగులో ఎందుకు చేయకూడదు అని 'ఏ మాస్టర్ పీస్' మొదలుపెట్టాం. హాలీవుడ్ లో కూడా ఉపయోగించని టెక్నాలజీని మా సినిమాకు వాడుతున్నాం' అన్నారు.