Bhagavanth Kesari Wins Big:ఆదరణ... అవార్డులు

ABN , Publish Date - Aug 02 , 2025 | 06:18 AM

హీరోల ఇమేజ్‌ను వాడుకుంటూ మూస ధోరణిలో సినిమాలు చేయడానికే ఎక్కువ మంది యువ దర్శకులు ప్రయత్నిస్తున్న

హీరోల ఇమేజ్‌ను వాడుకుంటూ మూస ధోరణిలో సినిమాలు చేయడానికే ఎక్కువ మంది యువ దర్శకులు ప్రయత్నిస్తున్న తరుణంలో అనిల్‌ రావిపూడి మాత్రం బాలకృష్ణ లాంటి ఫైర్‌ బ్రాండ్‌ను పెట్టుకొని ‘భగవంత్‌ కేసరి’ చిత్రంతో ఓ కొత్త ప్రయత్నం చేశారు. ఆడబిడ్డను సివంగిలా తయారుచేయాలనే సందేశాన్ని హృదయాలకు హత్తుకునేలా ఆవిష్కరించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల అంశాలను స్పృశిస్తూనే వాటికి మన ఇంటి నుంచే ఓ పరిష్కారం రావాలంటూ చూపించిన తీరు ఆకట్టుకుంది. కొన్నాళ్లుగా అభిమానులను మాత్రమే మెప్పించే మాస్‌ పాత్రలతో వరుస సినిమాలు చేస్తున్న బాలకృష్ణ తన పంథా మార్చి తండ్రీ కూతుళ్ల బంధం చుట్టూ కథను అంగీకరించడమూ విశేషమే. బాలకృష్ణ సినిమా అంటే మాస్‌ను మెప్పించే హంగులు, భారీ పోరాటాలు, నేపథ్య సంగీతం ఎలివేషన్లతో థియేటర్లు దద్దరిల్లిపోవాలనే ట్రెండ్‌ ఉధృతంగా నడుస్తున్న టైమ్‌లో బాలకృష్ణ ఈ చిత్రంలో పిల్లలపై వాత్సల్యం కురిపించే పాత్ర చే శారు. ఆయనకు ఈ చిత్రంలో కథానాయికతో డ్యూయెట్‌ సైతం లేదు. స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి తన పాత్ర పరిధి మేరకు ఆయన నటించారు. ఆ ప్రయత్నం వృథాగా పోలేదు. అప్పట్లో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకొన్న ‘భగవంత్‌ కేసరి’ నేడు జాతీయ పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికవడం ద్వారా మరో ఘనతను సాధించింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒక మహిళ ధైర్యంగా నిలబడాలి అనే సామాజిక స్పృహతో దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భయస్థురాలైన ఓ అమ్మాయి ధైర్యవంతురాలిగా మారేలా ప్రోత్సహించేలా మార్గదర్శకుడి పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. స్నేహితుడి కూతురుకు తానే తండ్రై సాకడంతో పాటు ఓ సివంగిలా ఆమెను తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమించే పాత్రను తన నటనతో రక్తికట్టించారు. ఆయన తెలంగాణ యాసలో చెప్పిన సంభాషణలు సైతం ఆకట్టుకున్నాయి. తెలంగాణ గద్దర్‌ పురస్కారాల్లో 2023లో ఉత్తమ తృతీయ చిత్రంగా ‘భగవంత్‌ కేసరి’ పురస్కారాన్ని దక్కించుకుంది. భగవంత్‌ కేసరి చిత్రానికి జాతీయ అవార్డు దక్కడానికి గల కారణాలను జ్యూరీ సభ్యులు వివరించారు. ఒక భయస్తురాలైన సాధారణ యువతి ధైర్యవంతురాలిగా ఎలా మారింది అనే చక్కటి కథాంశంతో ఈచిత్రం తెరకెక్కిందని జ్యూరీ ప్రశంసించింది. భావోద్వేగ సన్నివేశాలు, పోరాట ఘట్టాలు బలంగా ఉన్నాయని పేర్కొంది.

Updated Date - Aug 02 , 2025 | 06:18 AM