Samantha Interview: హీరోయిన్‌గానే అనుకున్నా.. ఒక్కసారిగా అలా జరిగింది

ABN , Publish Date - May 06 , 2025 | 06:37 PM

అగ్ర కథానాయికగా 15 ఏళ్ల కెరీర్‌.. కాలం కలిసొస్తే మరో 5 ఏళ్లు హీరోయిన్‌గా ఇండస్ట్రీలో నిలిచేది.. మయోసైటీస్‌ వ్యాధి ఒక్కసారిగా తారుమారు చేసేసింది... దాదాపు రెండేళ్లు సినిమాలకు గ్యాప్‌ తీసుకొచ్చింది..

అగ్ర కథానాయికగా 15 ఏళ్ల కెరీర్‌..
కాలం కలిసొస్తే మరో 5 ఏళ్లు హీరోయిన్‌గా ఇండస్ట్రీలో నిలిచేది
మయోసైటీస్‌ (Myositis) వ్యాధి ఒక్కసారిగా తారుమారు చేసేసింది.
దాదాపు రెండేళ్లు సినిమాలకు గ్యాప్‌ తీసుకొచ్చింది..
వ్యక్తిగత జీవితం, కెరీర్‌ గురించి మనసులో ఎన్నో ఆలోచనలు..
ఓ పక్క ఫ్రస్ట్రేషన్‌.. డిప్రెషన్‌..
వీటన్నింటిని అధిగమించి, ఆ ట్రామా నుంచి బయటకు రావడానికి సమంత ఏం చేశారు
చాలాకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన సమంత (Samantha) ఏం చెప్పారు..


లైఫ్‌ అంతా బాగా నడుస్తోంది అనుకుంటున్న సమయంలో రెండు రకాల కుదుపులు నన్ను ఇబ్బంది పెట్టాయి. వాటిని తలచుకోవడం కూడా ఇష్టం లేదు నాకు. మయోసైటీస్‌తో మాత్రం చాలా ఇబ్బంది పడ్డా. ఇక నా లైఫ్‌ అయిపోయిందా? హీరోయిన్‌గా కొనసాగలేనా? ఇంతేనా జీవితం అని వంద రకాల ఆలోచనలు వెంటాడాయి. అయితే నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు నా మనసు ఏం చెబితే అది చేయడం. ఇప్పటి వరకూ నా కెరీర్‌ తీసుకున్న ఏ నిర్ణయం అయినా నా మనసు చెప్పిందే. మయోసైటీస్‌తో ఏడాది గ్యాప్‌ తర్వాత ఆలోచనలో ఉన్న నాకు మనసు ఒకటే చెప్పింది. 'ఇక్కడితో నీ లైఫ్‌ అయిపోలేదు. చేయాల్సింది చాలా ఉంది.. ముందడుగు వెయ్యి’ అని చెప్పింది. అక్కడ పుట్టుకొచ్చిందే నిర్మాణ సంస్థ.

అలా కలిసొచ్చింది..
అన్ని సినిమాలకు చివర్లో శుభం కార్డ్‌ పడుతుంది. మా సినిమా శుభం కార్డ్‌తో మొదలవుతుంది. సీరియల్స్‌కి అడిక్ట్‌ అయిన కొందరు మహిళల ఇత్తివృత్తంతో నడిచే కథ ఇది. హారర్‌ థ్రిల్లర్‌గా అనిపిస్తుంది కానీ ఇందులో ఉన్న విషయం వేరు. కామెడీ, హారర్‌, సోషల్‌ మెసేజ్‌, సెటైర్‌లతోపాటు ఇంకేదో ఉంటుంది. అదేంటో 9న తెరపై చూడండి. ఈ డేట్‌న అనుకుని విడుదల చేయడం లేదు. అలా కలిసొచ్చింది.

ఆ ఆలోచనతోనే...

15 ఏళ్ల క్రితం నేను కూడా ఇండస్ట్రీకి కొత్త అమ్మాయినే. అప్పుడు గౌతమ్‌ మీనన్‌ రిస్క్‌ చేసి పిలిచి అవకాశం ఇచ్చారు. ఆయన తలుచుకుంటే స్టార్‌ హీరోయిన్లు చాలామంది క్యూ కడతారు. కానీ ఆడిషన్‌లో నన్ను గుర్తించి హీరోయిన్‌ని చేశారు. ఇప్పుడు అదే ఆలోచన నాకు వచ్చింది. నేనెందుకు సినిమా ప్రొడ్యూస్‌ చేయకూడదు? ప్రతిభ గల వారికి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? అనిపించింది. అప్పుడు ట్రాలాలా సంస్థను ప్రారంభించి సినిమాలు తీయాలనుకున్నా. అలా తీసిందే.. శుభం సినిమా. సినిమాలో నా కామియో వల్ల వీకెండ్‌ మూడు రోజులు ఉపయోగపడుతుంది. తర్వాత అంతా ఆర్టిస్ట్‌ల మీదే నడవాలి. ఈ సినిమాకు బడ్జెట్‌ ఎంత? రెమ్యునరేషన్స్‌ ఎంత అనేది పట్టించుకోలేదు. కథకు కావలసింది పెట్టాం. కానీ అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే అయింది. నిర్మాత సినిమాకు పని చేసిన వాళ్లకు ఈక్వల్‌ రెమ్యునరేషన్‌ ఇవ్వాలన్నది నా కోరిక. ప్రస్తుతం నిర్మాతగా నాకు భవిష్యత్తు ఉందా లేదా అన్నది చూస్తున్నా.


Sam-2.jpg
నా ప్రొడక్షన్‌లో నేను.. నెవర్‌
నా ప్రొడక్షన్‌ హౌస్‌ మొదటి చిత్రంలో నేను హీరోయిన్‌గా చేయకూడదని ముందే అనుకున్నా. అయితే ఇందులో కామియో చేశా. అయితే అది కూడా ప్లాన్‌లో లేదు. ఆ పాత్ర కోసం ఎవర్నో ఫేవర్‌ అడగడం ఇష్టం లేక నేనే చేసేశా. ఇప్పుడు సినిమా అనగానే 500, 1000 కోట్లు అనే మాటలు వినిపిస్తున్నాయ. మాది చిన్న సినిమా కాబట్టి ఈ  సినిమాలో యాక్ట్‌ చేసిన వారంతా అలా అనుకోవడం లేదు కానీ.. రిలీజ్‌ దగ్గరికి వచ్చాక వారిలో ఎగ్జైట్‌మెంట్‌ చూస్తే నాకు ముచ్చటేసింది. ఈ సినిమాలో నటించిన వారంతా చదువుకుంటూ, మంచి జాబ్స్‌లో ఉన్నవారే. సినిమా మీద ప్యాషన్‌తో అవన్నీ వదిలి వచ్చేశారు. వారి ఎగ్జైట్‌మెంట్‌ చూస్తే కెరీర్‌ బిగినింగ్‌లో నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది. అవన్నీ ఒక్కసారిగా నా కళ్ల ముందు మెదులుతున్నాయి. అప్పటి ప్రమోషన్స్‌ గుర్తొస్తున్నాయి.

రిస్క్‌ చేయాల్సిందే..
నేను సినిమా ప్రొడ్యూస్‌ చేస్తున్నానని ఇటీవల జయసుధగారికి చెబితే ుఎందుకమ్మా ఈ తిప్పలు’ అన్నారు. మార్పు కావాలంటే రిస్క్‌ చేయాల్సిందే, నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ సినిమా చిత్రీకరణ నుంచి అన్ని విషయాల్లో మార్పు వచ్చింది. మార్పునకు తగ్గట్లే ముందుకెళ్లాలి. నా ఇన్నర్‌ వాయిస్‌ ఇదే చెప్పింది.

Sam.jpg

నాలాగే చాలామంది వస్తారు..
నా 15 ఏళ్ల కెరీర్‌లో చాలా జరిగాయి. వాటిలో సినిమా నిర్మాణం కూడా ఒకటి. మంచి కథలు చెప్పాలి. నాకు అవకాశాలు దక్కినట్లుగానే ప్రతిభగల వారికి అవకాశాలు ఇవ్వాలి. ఇదే నా కాన్సెప్ట్‌. అంతా సజావుగా ముందుకెళ్తుందని నమ్ముతున్నా. కొంత సమయందాకా యాక్టింగ్‌ ఒకటే నాకు తెలుసు అనుకున్నా. కానీ ఇంకా ఏదో చేయగలననే నమ్మకం నాకు కలిగింది. ఎందుకంటే.. ఈ జర్నీలో ఎన్నో గట్టెక్కి ఇక్కడిదాకా వచ్చా.. ఇంకా ఈదగలను అనే నమ్మకం నాకుంది.

హీరోయిన్‌గానే ఉంటాననుకున్నా..
ఫిల్మ్‌ మేకింగ్‌ ప్రాసెస్‌ అంత ఈజీ కాదు. దీంతో క్రూ మీద చాలా రెస్పెక్ట్‌ పెరిగింది. సినిమా వల్ల నాకు పేరు, గుర్తింపు వచ్చింది.. కానీ ఇంకా ఏదో చేయాలి అని ఉండేది. అప్పటి దాకా నేను హీరోయిన్‌గానే కొనసాగుతాను.. అనుకుంటున్న సమయంలో అది ఆగింది. ఏమీ అర్థం కానీ పరిస్థితి. అప్పుడు నేను రియలైజ్‌ అయ్యా. బయటకు తెలియకుండా సినిమా ప్రారంభించి ఎనిమిది నెలల్లో సినిమా పూర్తి చేశాం. రిలీజ్‌కు తీసుకొచ్చాం.

నిర్మాతల హీరోయిన్‌ కాదని తెలిసింది..
ఇప్పటిదాకా నేను నిర్మాతల హీరోయిన్‌ని అనుకునేదాన్ని. కాదని ఈ మధ్యనే తెలుస్తోంది. ప్రొడ్యూసర్స్‌ హీరోయిన్‌ కావాలంటే ఇంకా మారాలని ఇప్పుడు తెలిసింది. నాలో ఇంకా మార్పు రావాలి. సినిమా మేకింగ్‌ మధ్యలో కథ, సీన్స్‌ ఇలా చాలా మార్పులు ఉంటాయి. అన్నింటినీ పాజిటివ్‌గా తీసుకుని ముందుకెళ్లాలి.

Updated Date - May 06 , 2025 | 06:44 PM