Dhanush: ఇటాలియన్‌ మోడల్‌లా కనిపిస్తావు అన్నారాయన.. అదే నా ధైర్యం

ABN , Publish Date - Jun 29 , 2025 | 09:17 AM

ధనుష్‌ .. పక్కింటి కుర్రాడిలా ఉంటాడు.  రఘువరన్‌ బీటెక్‌తో తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న ఈ తమిళస్టార్‌... శేఖర్‌ కమ్ముల ‘కుబేర’లో మరోసారి విభిన్నంగా కనిపించి, మెప్పించాడు.

ధనుష్‌(Dhanush)... పక్కింటి కుర్రాడిలా ఉంటాడు.  ‘రఘువరన్‌ బీటెక్‌’తో తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న ఈ తమిళస్టార్‌... శేఖర్‌ కమ్ముల ‘కుబేర’లో (kubera) మరోసారి విభిన్నంగా కనిపించి, మెప్పించాడు. ఇటీవల ధనుష్‌ పంచుకున్న కొన్ని ఆసక్తికర కబుర్లివి...

అమ్మాయి కోసమే ట్యూషన్‌లో చేరా...

మమ్మల్ని చదివించేందుకు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో.. నా పిల్లలను చదివిస్తుంటే నాకు అర్థమవుతోంది. నేను చదువుకోవాల్సిన సమయంలో తెగ అల్లరి చేసేవాణ్ని. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసమే ట్యూషన్‌లో చేరా. ట్యూషన్‌ టీచర్‌ ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పలేకపోయేవాణ్ని. కొన్ని రోజులకు నాపై నాకే సిగ్గేసి ట్యూషన్‌ మానేశా. కానీ స్నేహితురాలిని కలుసుకునేందుకు బయట వేచి చూసేవాణ్ని. నేను వచ్చినట్టు ఆమెకు తెలియాలని బైక్‌తో సౌండ్‌ చేసేవాణ్ని. దాంతో టీచర్‌... ‘మీరంతా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉంటారు. కానీ బయట బైక్‌ మీద ఉన్నవాడు మాత్రం పెద్దయ్యాక వీధుల్లో డ్యాన్స్‌ చేసుకోవాల్సిందే’ అని అన్నారట. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే... అప్పట్లో చదువు ఎందుకు అశ్రద్ధ చేశానా? అని బాధపడుతుంటా.

అందుకే ఆ పేరు...
నేను, అనిరుధ్‌ (సంగీత దర్శకుడు) కలసి ‘ఇన్‌గ్లోరియస్‌ బాస్టర్డ్స్‌’ అనే హాలీవుడ్‌ చిత్రం చూశాం. ఆ సినిమాలో అందరూ ‘వండర్‌బార్‌’ అనే పదం పదేపదే వాడుతుంటారు. నిజానికి అదొక జర్మన్‌ పదం. ఎందుకోగానీ అది మైండ్‌లో బాగా రిజిస్టరైపోయింది. కట్‌చేస్తే కొన్ని రోజుల తర్వాత నేను ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకున్నా. రెండో ఆలోచన లేకుండా నా నిర్మాణ సంస్థకు ‘వండర్‌బార్‌ ఫిల్మ్స్‌’ అని పేరు పెట్టా.

ఆయన ప్రేరణతో...
కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. ‘హీరో మెటీరియల్‌ కాదు. లుక్స్‌ బాగాలేవు’ అని విమర్శలు గుప్పించారు. దాంతో ఆత్మన్యూనత భావన కలిగింది. సరిగ్గా అప్పుడే దర్శకుడు బాలు మహేంద్ర.. ‘నువ్వు ఇటాలియన్‌ మోడల్‌లా కనిపిస్తావు. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు’ అని చెప్పారు. ఆ మాటలు నన్ను ప్రేరేపించాయి.


Dhanush-1.jpg

- తెలుగులో అభిమాన హీరో: పవన్‌కల్యాణ్‌. అవకాశం
వస్తే ఆయన్ని డైరెక్ట్‌ చేస్తా.
- మల్టీస్టారర్‌ చేయాలంటే: తారక్‌ (ఎన్టీఆర్‌)తో చేస్తా.
- ఫేవరెట్‌ హీరోయిన్‌: ఖుష్బూ, సిమ్రాన్‌
- ఇష్టమైన ఆహారం: ఆవకాయ, పప్పు
- ఎవరికీ తెలియని విషయం:  కెమెరా ముందు అలవోకగా నటిస్తా గానీ స్టేజీ మీద మాట్లాడాలన్నా, ఇంటర్వ్యూలలో మాట్లాడాలన్నా కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంటా.
- కోరిక: రజనీకాంత్‌, ఇళయరాజా బయోపిక్స్‌లో నటించాలనుంది. వారంటే నాకు అపారమైన గౌరవం.


జోక్‌ చేస్తున్నారనుకున్నా..

‘కుబేర’ తమిళ్‌లో నాకు 51వ సినిమా. తెలుగులో రెండో స్ట్రయిట్‌ చిత్రం. ‘సార్‌’ కన్నా ముందే నాకు శేఖర్‌ కమ్ముల ఈ కథ చెప్పారు. ఈ సినిమా కోసం నన్ను శేఖర్‌ సన్నబడమని చెప్పినప్పుడు మొదట నమ్మలేదు. ‘నిజంగానే చెబుతున్నారా? లేక జోక్‌ చేస్తున్నారా’ అని అడిగా. ఎందుకంటే నా పర్సనాలిటీ చూసి, నన్ను సన్నబడమని చెప్పిన డైరెక్టర్‌ ఇప్పటిదాకా లేరు. మొత్తానికి సన్నబడి యాచకుడిగా నటించా. డైరెక్టర్‌ చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోయానంతే. 7 గంటలపాటు డంప్‌యార్డ్‌లో మాస్క్‌ లేకుండా నటించా. నా మనసుకు చాలా దగ్గరైన చిత్రమిది.

చెఫ్‌ అయ్యేవాడిని...
ఒకసారి మా నాన్నగారికి సరదాగా ఆమ్లెట్‌ వేసి పెట్టా. అది ఆయనకు బాగా నచ్చింది. ఆ తర్వాత రోజు వేరే వంటకం చేసి పెట్టా. దాన్ని కూడా ఆయన చాలా ఆస్వాదించారు. దాంతో నాకు చెఫ్‌ అవ్వాలనే కోరిక కలిగింది. వంట చేసి, వడ్డించేటప్పుడు ఎదుటివారి కళ్లలో కనిపించే ఆనందం చాలా సంతృప్తినిస్తుంది. ఇప్పటికీ మా ఇంటికి ఎవరైనా వస్తే, నేను నా స్వహస్తాలతో వారికి వడ్డిస్తుంటా. హీరోని కాకపోయుంటే కచ్చితంగా చెఫ్‌ అయ్యేవాడిని.

Updated Date - Jun 29 , 2025 | 10:11 AM