Ivana: రొమాంటిక్‌ సీన్స్‌ కష్టం.. అవి అలవోకగా చేస్తా!

ABN , Publish Date - May 18 , 2025 | 12:38 PM

గ‌త సంవ‌త్స‌రం ‘లవ్‌టుడే’ సినిమాతో త‌మిళంతో పాటు ఇటు తెలుగు ఇండ‌స్ట్రీని తన క్యూట్‌ లుక్స్‌తో కట్టిపడేసింది ఇవానా.

ivana

గ‌త సంవ‌త్స‌రం ‘లవ్‌టుడే’ సినిమాతో త‌మిళంతో పాటు ఇటు తెలుగు ఇండ‌స్ట్రీని తన క్యూట్‌ లుక్స్‌తో కట్టిపడేసింది ఇవానా (Ivana). ఆ సినిమా విజయం తర్వాత తమిళంలో వరుస సినిమాలతో బిజీ అయ్యింది. తాజాగా ‘సింగిల్‌’ (Single Movie) సినిమాతో నేరుగా తెలుగు తెరపైకి వచ్చిన ఈ కేరళ కుట్టి మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేసింది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌జ్యోతితో ప్ర‌త్యేకంగా చెప్పిన‌ కబుర్లివి.

Ivana

ఖాళీ సమయాల్లో.. ఏం చేస్తుంటారు.

ఖాళీ సమయం దొరికితే చాలు.. నచ్చిన పుస్తకాలన్నీ తిరగేస్తుంటా. మనలో స్ఫూర్తిని నింపేందుకు పుస్తకాలు చాలా తోడ్పడతాయి. షూటింగ్స్‌లో కాస్త విరామం దొరికితే.. ఫ్రెండ్స్‌తో కలిసి జాలీట్రిప్స్‌ వేస్తుంటా. వర్షంలో ఆడుతూ, చెట్ల మధ్య తిరుగుతూ.. ప్రకృతిని ఆస్వాదించడమంటే ఇష్టం.

సినిమాల్లోకి ఎప్పుడు వ‌చ్చారు..

పన్నెండేళ్లకే ‘మాస్టర్స్‌’ సినిమాతో మలయాళంలో బాలనటిగా అడుగుపెట్టా. ఇంటర్‌లో ఉండగా ‘నాచియార్‌’తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చా. జ్యోతిక ప్రధాన పాత్రలో ‘ఝాన్సీ’ పేరుతో తెలుగులో డబ్‌ అయ్యింది. అయితే అందులో నేను డీ గ్లామర్‌ రోల్‌ చేశా. ఆ తర్వాత వరుసగా ‘హీరో’, ‘లవ్‌టుడే’, ‘ఎల్‌జీఎమ్‌’, ‘మతిమారన్‌’, ‘కల్వన్‌’ చిత్రాలతో పాటు, ఇటీవల వచ్చిన ‘డ్రాగన్‌’లో క్యామియోలో కనిపించా. అలా అనుకోకుండా హీరోయిన్‌ అయ్యాను.

ఎత్తు తక్కువగా ఉన్నానని...

నా ఎత్తు కారణంగా ఎన్నో విమర్శలు, తిరస్కరణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్కూల్‌లో పొట్టిగా ఉన్నానని తోటివారు ఎగతాళి చేసేవారు. అప్పట్లో వాళ్ల మాటలు ఎంతో బాధించాయి. చదువుపై శ్రద్ధ పెట్టలేక పోయేదాన్ని. ఇక కెరీర్‌ ప్రారంభంలో కన్నడలో ఒక పెద్ద హీరోతో నటించే అవకాశం వచ్చింది. పూజా కార్యక్రమం కూడా అయిపోయాక... హీరోకు తగ్గ ఎత్తు లేనని నన్ను తప్పించారు. చాలా బాధేసింది. ఆ తర్వాత విమర్శలను పట్టించుకోవడం మానేసి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం ప్రారంభించా.

అస‌లు పేరు..

నా అసలు పేరు ఎలీనా షాజీ. చాలామందికి నా పేరు పలకడం వచ్చేది కాదు. ‘నాచియార్‌’లో నటిస్తున్నప్పుడు దర్శకుడు బాలా సర్‌ ‘అందరూ సులువుగా పిలవగలిగే పేరు పెట్టుకో. దాన్నే స్క్రీన్‌ నేమ్‌ చేద్దాం’ అన్నారు. ఇంట్లో మేమంతా ఆలోచించి ‘ఇవానా’ సెలక్ట్‌ చేశాం. ఇప్పుడు నా సొంతపేరు కొన్నిసార్లు నాకే గుర్తుండ‌టం లేదు.

Ivana

బన్నీకి వీరాభిమానిని..

తెలుగు డబ్బింగ్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ ‘హ్యాపీడేస్‌’. ఇప్పటికీ ఆ సినిమా పాటలు వింటుంటా. చిన్నప్పుడు టీవీలో ‘హ్యాపీడేస్‌’ వస్తోందంటే చాలు.. ఎంత పనున్నా, పక్కనపెట్టి టీవీకి అతుక్కు పోయేదాన్ని. తెలుగులో నా ఫేవరెట్‌ హీరో అల్లు అర్జున్‌. ఆయన నటన, డ్యాన్స్‌కు నేను ఫిదా అయిపోయా. మలయాళ డబ్బింగ్‌ వెర్షన్‌లో బన్నీ సినిమాలన్నీ చూసేశా.

గ్లామర్‌కు నో..

రొమాంటిక్‌ సీన్స్‌ కష్టం కానీ.. ఎమోషనల్‌ సీన్స్‌ అలవోకగా చేస్తా. ప్రేక్షకులు ‘మన ఇంట్లో అమ్మాయిలాగే ఉందే’ అనుకునే పాత్రలనే ఎంపిక చేసుకుంటా. గ్లామర్‌ రోల్స్‌ నచ్చవు. యాక్షన్‌, అడ్వెంచర్‌ సినిమాల్లో నటించి, నాలోని సరికొత్త కోణాన్ని ప్రదర్శించాలని ఉంది. ఆ జానర్‌ సినిమాలు నా వరకు ఎప్పుడొస్తాయో చూడాలి.

కాంప్లిమెంట్‌ ఇస్తే చాలు...

నా కళ్లు ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటాయని అంటారు. ఎవరైనా కాంప్లిమెంట్‌ ఇవ్వగానే అద్దం ముందుకు వెళ్లి... కాసేపు తదేకంగా నా కళ్లను చూసుకుంటూ మురిసిపోతుంటా. నిగనిగా మెరిసే జుట్టు కోసం.. కలబంద, ఉల్లిరసం, నీలిబ్రింగాది ఆయిల్‌, గుడ్డులోని తెల్లసొన కలగలిపిన మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు తలకు అప్లై చేస్తుంటా. ఇదే నా హెయిర్‌కేర్‌ రొటీన్‌.

Ivana

Updated Date - May 18 , 2025 | 12:38 PM