Vishal: దివాళా.. తీసినట్టు ప్రకటిస్తారా? రూ.10 కోట్లు డిపాజిట్ చేయండి.. విశాల్‌పై హైకోర్టు సీరియ‌స్‌

ABN , Publish Date - Nov 25 , 2025 | 08:42 AM

రూ.21 కోట్ల రుణం కేసులో హీరో విశాల్‌పై మద్రాస్ హైకోర్టు ప్రశ్నలు. దివాళా ప్రకటించేందుకు సిద్ధమా అని కోర్టు వ్యాఖ్య. రూ.10 కోట్లు డిపాజిట్ ఆదేశం.

Vishal

దివాళా తీసినట్టుగా ప్రకటించేందుకు సిద్ధమా? అని నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ (Vishal)ను మద్రాస్‌ హైకోర్టు (Madras High Court) ప్రశ్నించింది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించడంలో కోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను పాటించక పోవడంతో ఒకింత అసహనం వ్యక్తం చేసింది.

ప్రముఖ సినీ ఫైనాన్షియర్‌, నిర్మాత అన్బుచెళియన్ (Anbu Chezhiyan) దగ్గర ఒక సినిమా ప్రాజెక్టు నిమిత్తం హీరో విశాల్‌ గతంలో రూ.21 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ తర్వాత వారిమధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ రుణాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) చెల్లించేందుకు సమ్మతించింది. అయితే, విశాల్‌ నటించే చిత్రాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇవ్వాలని లైకా షరతు విధించింది. కానీ, విశాల్‌ తాను నటించిన సినిమా రైట్స్‌ను లైకాకు ఇవ్వకపోగా రుణాన్ని కూడా చెల్లించలేదు.

దీంతో లైకా సంస్థ కోర్టును ఆశ్రయించగా, రూ.21 కోట్ల రుణానికి 30 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఇటీవల మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశించింది. ఈ తీర్పుపై విశాల్‌ అప్పీల్‌ చేయగా, దీనిపై సోమవారం విచారణ జరిగింది. అపుడు విశాల్‌ తరపున హాజరైన న్యాయవాదులు తమ క్లైయింట్‌ ధనవంతుడు కాదని కోర్టుకు తెలిపారు. అలా అయితే, మీరు దివాళా తీసినట్టుగా ప్రకటించేందుకు సిద్ధమా? అని ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నిస్తూ, గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. అలాగే, విశాల్‌ రూ.10 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

Updated Date - Nov 25 , 2025 | 08:42 AM