Vetrimaaran - Simbhu: ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు...
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:28 PM
దర్శకుడు వెట్రిమారన్... సూర్య, ధనుష్ తో చేయాలనుకున్న సినిమాలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు శింబుతో చేస్తున్న 'అరసన్' మూవీ సైతం చిక్కుల్లో పడింది. మరి ఈ కష్టాల నుండి వెట్రిమారన్ గట్టెక్కుతాడో లేదో చూడాలి.
ఒక్కోసారి ఒక్కొక్క దర్శకుడి హవా సాగుతుంది. ఒక్కోసారి ఒక్కో హీరోకు భలే కాలం కలిసొస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రకమైన ఇబ్బందులు ఇటు దర్శకులకు, అటు కథానాయకులకు ఎదురవుతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులనే డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran), హీరో శింబు (Simbu) ఎదుర్కొంటున్నారు. తమిళ చిత్రసీమలో వెట్రిమారన్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అట్టడుగు వర్గాల ప్రజల కష్టాలను వెట్రి మారన్ హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిస్తాడని భావిస్తుంటారు. అందువల్లే అతని సినిమాలు పలు అవార్డులనూ అందుకున్నాయి. అలానే కమర్షియల్ గానూ సక్సెస్ సాధించాయి. కానీ చిత్రం ఏమంటే... గత కొంతకాలంగా వెట్రిమారన్ అనుకుంటున్న ప్రాజెక్ట్స్ ఏవీ అనుకున్న విధంగా పూర్తి కావడం లేదు.
వెట్రిమారన్ హీరో సూర్య (Suriya) తో 'వాడివాసల్' అనే మూవీ చేయాలని అనుకున్నాడు. అది మెటీరియలైజ్ కాలేదు. దాంతో ధనుష్ (Dhanush) తో 'వడ చెన్నయ్ 2' (Vada Chennai 2) చేయాలనుకున్నాడు. అదీ వర్కౌట్ కాలేదు. ఇక లాభం లేదని ఈ రెండు ప్రాజెక్ట్స్ పక్కన పెట్టేసి, ఇప్పుడు శింబు హీరోగా 'అరసన్' మూవీ చేస్తున్నాడు. దీన్ని కలై పులి ఎస్ థాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తొలి షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. దీనికి తెలుగులో 'సామ్రాజ్యం' అనే పేరు పెట్టారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటిస్తున్నాడని మేకర్స్ తెలిపారు. అతి ప్రధాన పాత్రో, అతిధి పాత్రో తెలియదు. అయితే చిత్రం ఏమంటే... ఇప్పుడీ సినిమా షూటింగ్ లో శింబు పాల్గొనకుండా ప్రముఖ నిర్మాణ సంస్థ మోకాలడ్డుపెట్టింది.
గతంలో శింబు వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కు 'కరోనా కుమార్' అనే సినిమా చేయడానికి అంగీకరించాడు. కానీ ఆ సినిమాను పూర్తి చేయలేదు. అతను ఇచ్చిన మాట తప్పి వేరే సినిమాలకు చేయడంపై నిర్మాణ సంస్థ 2023లో మద్రాస్ హైకోర్ట్ తలుపు తట్టింది. దాంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం శింబు ఇప్పుడు వెట్రిమారన్ సినిమా షూటింగ్ లో పాల్గొనలేని పరిస్థితులు ఉద్భవించాయని తెలుస్తోంది. అందుకే శింబు వర్క్ ను హోల్డ్ లో పెట్టి వెట్రిమారన్ టైమ్ బీయింగ్ విజయ్ సేతుపతితో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాడని అంటున్నారు. ఏదే ఏమైనా సూర్య, ధనుష్ చిత్రాలు ఎలాగైతే అటకెక్కాయో... ఇప్పుడు శింబు సినిమా కూడా అలానే ఆగిపోతుందేమోననే సందేహాన్ని తమిళనాడులోని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ సీనియర్ నిర్మాత కలైపులి థాను ఎలాగైనా శింబును ఈ కష్టాల నుండి గట్టెక్కిస్తాడని, అనుకున్న విధంగానే వెట్రిమారన్ తో ఈ సినిమా పూర్తి చేయిస్తాడని కొందరు నమ్ముతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో!