Tourist Family:చిన్న సినిమా.. పెద్ద హిట్...
ABN , Publish Date - May 07 , 2025 | 06:40 PM
మానవతా విలువల నేపథ్యంలో తెరకెక్కిన తమిళ్ మూవీ 'టూరిస్ట్ ఫ్యామిలీ' దుమ్మురేపుతోంది. హార్ట్ టచింగ్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ... మూవీలవర్స్ ను తెగ ఆకట్టుకుంటోంది.
సినిమా అనగానే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, గ్రాండ్ విజువల్స్ ఉంటేనే హిట్ అవుతుందనే అభిప్రాయం చాలా మందికి ఉంది. కానీ ఇండస్ట్రీలో కొన్ని చిన్న సినిమాలు ఈ నమ్మకాన్ని తుడిచిపెట్టేశాయి. చిన్న బడ్జెట్‌తో చేసినా, కథకు బలం ఉంటే సినిమాలు సూపర్ హిట్ అవుతాయని నిరూపించాయి.కథ, నటన, భావోద్వేగం అన్నీ కలిసినప్పుడు, స్టార్ హీరోలు లేకపోయినా, ప్రమోషన్ బడ్జెట్ తక్కువైనా సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలవగలదని రుజువు చేశాయి చాలా సినిమాలు. ఇప్పుడు ఆ కెటగిరిలోకి ఓ తమిళ్ మూవీ చేరింది. జస్ట్ మౌత్ టాక్ తోనే జనాన్ని థియేటర్లకు రప్పిస్తోంది.
బడ్జెట్ పెద్దగా లేనప్పటికీ, మంచి కథ ఉన్న సినిమాలు ఎప్పుడూ ఆడియెన్స్ మదిలో నిలుస్తుంటాయి. అలా తమిళ్ కామెడీ డ్రామా 'టూరిస్ట్ ఫ్యామిలీ' ( Tourist Family)కి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంటోంది. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ (Simran) , సీనియర్ యాక్టర్ శశికుమార్ (Shashi Kumar), పాపులర్ కమెడియన్ యోగి బాబు (Yogi Babu) నటించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మౌత్ టాక్ తోనే జనాన్ని థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తోంది. నూతన దర్శకుడు అభిషాన్ జీవింత్ రూపొందిన ఈ సినిమాను నాజెరత్ పసిలాన్, మగేష్ రాజ్ పసిలాన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. దాదాపు 7 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ఇప్పటి వరకు దాదాపు 17 కోట్లు కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన 'టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ మే 1న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమాకు స్టార్ హీరో మద్దతు లేదు. పైగా తీసిన దర్శకుడు అంత ఫేమస్ కూడా కాదు. పైగా పాతికేళ్లు కూడా లేవు ఆ డైరెక్టర్ కు. సినిమా అంత అరవ నటీనటులే అయినా సరే .. వసూళ్లతో రచ్చ చేస్తోంది. తెరపై దాదాపు 60 మంది మాత్రమే ఉన్నారు. అయినప్పటికి సూర్య రెట్రో (Retro), నాని హిట్ 3 (HIT 3) సినిమాలను సైతం వెనక్కి నేటేస్తోంది. చిన్న చిత్రంగా వచ్చిన ఈ మూవీ ... సోమవారం బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కి 66 వేల టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. దీంతో మూవీ తెలుగు రైట్స్ ను కొనేందుకు పలువురు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య నిర్మాతలు తమ సినిమాలు బాగా ఆడకపోతే... నెగిటివ్ రివ్యూ , క్రికెట్ , సమ్మర్ సీజన్ అంటూ చెప్పుకుంటున్నారు తప్ప... ఆడియెన్స్ కు ఏం కావాలో ఆలోచించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.