Trisha: సినిమాను నిజజీవితంతో ఎందుకు పోలుస్తారు
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:31 PM
తన పాత్రకు నెగెటివ్ కామెంట్స్ రావడంతో హీరోయిన్ త్రిష (trisha) తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇందులో ఇంద్రాణి పాత్రలో త్రిష నటించగా, ఈ పాత్రపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.
అగ్ర నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) - దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani ratnam) కాంబినేషన్‌లో వచ్చిన ‘థగ్ లైఫ్’ మూవీ ఈ నెల 5వ తేదీన విడుదల కాగా ఈ సినిమాలోని తన పాత్రకు నెగెటివ్ కామెంట్స్ రావడంతో హీరోయిన్ త్రిష (trisha) తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇందులో ఇంద్రాణి పాత్రలో త్రిష నటించగా, ఈ పాత్రపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై త్రిష స్పందిస్తూ, ‘మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీలోని ‘కుందవై’ పాత్రను అమితంగా ఇష్టపడ్డారు. ఈ పాత్ర నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. నా కెరీర్‌లో ఒక ముఖ్యపాత్రగా మారింది. కానీ, ‘థగ్ లైఫ్’ మూవీలో ఇంద్రాణి పాత్రపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కమల్, శింబుల పాత్రలతో సాగే నా క్యారెక్టర్‌ను కొందరు అసభ్య పదజాలంతో ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు మలయాళ బిట్ సినిమాలతో పోల్చుతున్నారు. ఇది ఒక సినిమా.. ఒక పాత్ర. దర్శకుడు చెప్పినట్టుగా నటించాను. మణిరత్నం - కమల్ కాంబోపై ఘాటైన విమర్శలు మంచిదా? నేను ఏం చేశాను? సోషల్ మీడియా వైపు చూడాలంటేనే భయం వేస్తోంది. సినిమాను నిజ జీవితంతో ఎందుకు పోలుస్తారు?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ‘థగ్ లైఫ్’కు నెగెటివ్ కామెంట్స్ రావడానికి కథ, స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడంతో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందన్న చర్చ సాగుతోంది.